కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది పరివాహకంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి పాటిల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
ఢిల్లీలో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నది జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలోనూ ఆయా వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలియజేశారు.