సమాజంలో సాధారణ, సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అప్పులు చేసి ఆడంబరంగా వివాహ వేడుకలు నిర్వహించవద్దన్నారు. మైసూరు సమీపంలోని చామరాజనగర్‌లోని ఎంఎం హిల్స్ టెంపుల్‌లో బుధవారం జరిగిన సామూహిక కల్యాణోత్సవంలో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ… అప్పులు చేసి లేదా రుణాలు పొంది వివాహ వేడుకలను ఘనంగా జరుపుకోవడం సరికాదన్నారు.
ప్రజలు అప్పులు చేసి మరీ ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం మానుకోవాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. చామరాజనగర్ లోని ఎం.ఎం. హిల్స్ దేవాలయంలో నిర్వహించిన సామూహిక వివాహాల వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలు బయట రుణాలు తీసుకొచ్చి ఆర్భాటంగా పెళ్లిళ్లు చేయడం ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పారు. కొందరు వ్యవసాయ రుణాలు తీసుకొని సమాజంలో పేరు కోసం ఘనంగా వివాహాలు చేస్తున్నారన్నారు. పేద, శ్రామిక వర్గాలో ప్రజలు ఆడంబరాల కోసం చేసిన అప్పులను తీర్చడానికి జీవితాంతం కష్టపడాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే సమాజం నిరాడంబరంగా జరిగే సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని సీఎం పిలుపునిచ్చారు.