- సీఎం జగన్ ప్రసంగంపై సర్వత్రా విస్మయం
- తాజా ప్రసంగం ఎన్నికలను తలపించిందన్న విమర్శలు
- రాష్ట్రంలో పెరుగుతున్న కేసులను లైట్ తీసుకున్నారా?
- లాక్‌డౌన్‌పైనా లేని స్పష్టత
- 80శాతం మండలాల్లో కరోనా లేదని వెల్లడి
- కేసులు వెయ్యి దాటడంపై జగన్ మౌనం
- తీవ్రత పెరుగుతున్నా.. ఏమీలేదన్నట్టుగా వెల్లడి
- అదేసమయంలో తాను కూడా అతీతుడిని కాదని హెచ్చరిక
- కరోనాతో ముప్పులేదని వ్యాఖ్యలు
- వెరసి ఎన్నికల ప్రసంగాన్ని తలపించిన జగన్ మీడియా మీట్
(విజయవాడ నుంచి మనలోకం ప్రత్యేక ప్రతినిధి ) : ఏపీ సీఎం జగన్ మరోసారి కరోనా వైరస్ విషయంపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సోమవారం సాయంత్రం ఆయన చేసిన ప్రసంగం.. ప్రజలకు అవగాహన పెంచేలా చేయడంలోను, కరోనా నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకోబోయే జాగ్రత్తలు, లాక్‌డౌన్ పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, కేసుల పెంపును అరికట్టే విషయంలో ప్రజలను భాగస్వాములను చేయడం వంటివి ప్రధానంగా చర్చకు వస్తాయని రాష్ట్ర ప్రజలు, మేధావులు, వైద్యులు, పోలీసు వర్గాలు భావించాయి. అయితే, సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసాంతం గమనించిన సాధారణ ప్రజల నుంచి పెదవిరుపే కనిపించింది. ఇది ఎన్నికల ప్రసంగం మాదిరిగానే ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి. నిజానికి ఏపీలో గడిచిన వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. రెడ్ జోన్లు పెరుగుతున్నాయి. అదేసమయంలో ఇన్నాళ్లు అసలు కరోనా వ్యాప్తికి దూరంగా ఉన్న శ్రీకాకుళం వంటి జిల్లాలోనూ కేసులు నమోదు కావడం, పాతపట్నం వంటి ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించడం వంటివి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు.
ఇదిలావుంటే, విధుల్లో ఉన్న వైద్యులు, పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వస్తోంది. వీరిలో ఇప్పటికే ఒకరిద్దరు మృతి చెందారు. ఈ క్రమంలో సీఎం జగన్ తాజాగా చేసిన ప్రసంగంలో ఆయా అంశాలు తెరమీదికి వస్తాయని, పటిష్టమైన కార్యాచరణను ఆయన వెల్లడిస్తారని, రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా ఉండాలనే విషయాన్ని, అదేసమయంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా కఠిన నిబంధనలు, ఆంక్షలు పెరుగుతాయని, వీటిని కూడా సీఎం జగన్ ప్రస్తావిస్తారని అందరూ భావించారు. మరీ ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ రాజ్‌భవన్ సీనియర్ ఉద్యోగులతో పాటు ఐపీఎస్ అధికారి, గవర్నర్ వ్యక్తిగత సంరక్షకుల చీఫ్‌కు కూడా కరోనా పాజిటివ్ రావడంపైనా సీఎం కఠినంగా వ్యవహరిస్తారని అనుకున్నారు. కానీ, జగన్ మాత్రం అందరి అంచనాలను పటాపంచలు చేశారు.
స్వోత్కర్షలకే ప్రాధాన్యం
సాధారణంగా కరోనా సమయంలో ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పుకోవడం సహజమే అయినప్పటికీ.. అదేసమయంలో ప్రజల పక్షాన ప్రభుత్వం అనుసరించబోయే వ్యూహాలు, పటిష్ట కార్యాచరణకు, భవిష్యత్తులో కరోనాను ఎలా కట్టడి చేయాలనే అంశాలకు సీఎం వంటివారు కీలక ప్రాధాన్యం ఇస్తారని అందరూ అనుకుంటారు. అయితే, సీఎం జగన్ మాత్రం స్వోత్కర్షలకే(మెప్పులకే) ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తన ప్రభుత్వం ఎన్నో కష్టాల్లో ఉందని(తెలియని వారెవరు. సీఎం సీటు ఎక్కిన దగ్గర నుంచి ఆయన చెబుతున్నదే. మంత్రులు వల్లెవేస్తున్నదే కదా!?) అయినా కూడా తాను అవ్వాతాతలకు రూ.250 పెంచి 2250 చొప్పున నెలనెలా పింఛన్లు ఇస్తున్నానని, నెలకు మూడు సార్లు రేషన్ ఇస్తున్నానని, పేదలకు రూ.1000 సాయం చేశానని, కరోనా కేసుల పరీక్షలను దేశంలోనే ఎక్కువగా చేస్తున్న రాష్ట్రం మనేదేనని ఆయన భుజకీర్తులు తొడుక్కున్నారు. అదేసమయంలో మన దగ్గర రెడ్ జోన్లు తక్కువగానే ఉన్నాయని 80 శాతం జోన్లలో అస్సలు కరోనా లేదని చెప్పారు. అంటే.. దీని ఉద్దేశం ప్రస్తుతం రాష్ట్రం వెయ్యి మార్కు కేసుల సంఖ్యను దాటిందనే విషయాన్ని సీఎం ఇంకా గుర్తించలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
చేతులు ఎత్తేశారా?
సీఎం జగన్‌తన తాజా ప్రసంగంలో కరోనా తనకు వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పారు. అంతేకాదు, కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందేమోనని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేశారు. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే.. దాదాపు ప్రభుత్వం కరోనా విషయంలో చేతులు ఎత్తేసిందనే చెప్పాలి. ఇక, అంతటితో ఆగని జగన్.. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుందని, రాబోయే రోజుల్లో మరింత ప్రమాదమని అన్నారు. అదేసమయంలో అయినా భయపడాల్సింది ఏమీలేదని, కరోనా పెద్ద జబ్బు కాదని చెప్పారు. అయితే, ఇలాంటి వ్యాఖ్యలు నిజానికి ప్రభుత్వం ఎంత కష్టపడి చేస్తున్నా.. ఉదాశీనంగా ఉందనే సంకేతాలను ప్రజల్లోకి పంపుతాయన్న కనీస పరిజ్ఞానం కొరవడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని మేధావులు అంటున్నారు. ఇక, ఇవన్నీ ఇలా ఉంటే.. కరోనా సోకిన వారిని అంటరానివారిగా చూడొద్దన్నారు.. మరి అలాంటప్పుడు ఈ లాక్‌డౌన్ ఎందుకు? అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రతిపక్షాల నుంచి వచ్చే సూటి ప్రశ్న.
ఆది నుంచి ఉదాశీనతే!
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిజానికి పక్కనే ఉన్న తెలంగాణలో 10 పాజిటివ్ కేసులు నమోదై.. ఇద్దరు చనిపోయే నాటికి మన రాష్ట్రంలో కేవలం ఒకే ఒక పాజిటివ్ కేసు నమోదైంది. అప్పుడే సీఎం జగన్ కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇప్పుడు వెయ్యి మార్కు దాటి చేతులు ఎత్తేసే పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు నిపుణులు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. కరోనాను లైట్‌గా తీసుకుంటున్నారనే సంకేతాలనే జగన్ ప్రజలలోకి పంపించారు. ఇక, కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు వైద్యులు, మరోపక్క, పోలీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. సీఎం తాజాగా చేసిన ప్రసంగంలో మాత్రం ఈ తరహా ఆందోళన, ఆవేదన ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
లాక్‌డౌన్‌పై స్పష్టత ఏదీ
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం జగన్ లాక్‌డౌన్‌పై స్పష్టత ఇస్తారని, దీనిని పెంచడమో.. తుంచడమో.. చేస్తారని అందరూ ఆశించారు. నిజానికి తెలంగాణలో 200 కేసులు దాటినసమయంలో అక్కడి సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని, సహకరించాలని ప్రజలను కోరారు. లేకుంటే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ, మన దగ్గర అంత తీవ్రస్థాయి వ్యాఖ్యలు ఆశించకపోయినా.. లాక్‌డౌన్ కొనసాగింపు, లాక్‌డౌన్ రిలీఫ్ వేళలను ఉపసంహరించడం వంటి చర్యలు తీసుకుంటారని, జిల్లాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని అందరూ ఆశించారు. కానీ, జగన్ మాత్రం దీనికి విరుద్ధంగావ్యవహరించి.. అసలు లాక్‌డౌన్‌పై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపైనా సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి. ఏదేమైనా.. రాష్ట్రంలో అందివచ్చిన అధికారాన్ని సీఎం జగన్ తనదైన శైలిలో వినియోగించుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తుండడం గమనార్హం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్వోత్కర్షలు మానుకుని కార్యాచరణను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.