షుగర్ ఉన్నవాళ్లని రైస్ తినొద్దని వైద్యులు చెప్తుంటారు.. రొట్టలు తినమంటే.. ఏదో ఒకటి రెండు రోజులు అంటే.. తింటాం కానీ.. డైలీ ఏం తింటాం అని షుగర్ పేషెంట్ల బాధ.. కానీ.. తినే వాటిని రోజుకో వెరైటీగా, టేస్టీగా చేసుకుంటే.. ఆనందంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మిమ్మల్ని రైస్ తినొద్దన్నారు కానీ..రుచులకు దూరం కావొద్దనలేదు కదా.! మల్టీగ్రెయిన్ పిండితో కొబ్బరితో రొట్టెలు చేసుకుంటే.. షుగర్ పెరగదు. నీరసం తగ్గిపోతుంది.! ఈరోజు మనం కొబ్బరి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దామా..!
కొబ్బరి రొట్టె చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
కొబ్బరితురుము ఒక కప్పు
మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు
పెరుగు ఒక కప్పు
పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక స్పూన్
టమోటా ముక్కలు ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
కొత్తిమీర పావుకప్పు
వెల్లుల్లిముక్కలు ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయ ముక్కా చెక్కా ఒక టీ స్పూన్
కరివేపాకు కొద్దిగా
తయారు చేసే విధానం…
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసి, పుట్నాలపప్పు పొడి, ఎండుమిరపకాయ ముక్కా చెక్కా, జీలకర్ర పొడి, అల్లంపేస్ట్, కరివేపాకు ముక్కలు, కొత్తిమీర ముక్కలు, కొబ్బరి తురుము, నిమ్మరసం , గట్టిపెరుగు వేసి కలుపుకొండి. మల్టీగ్రెయిన్ పిండిని చల్లుకుంటూ.. చపాతీ కర్రతో చపాతీల్లా చేసుకోండి. కొంచెం లావుగానే చేసుకోండి. నాన్‌స్టిక్ పాత్రపైన రెండు వైపులా మెల్లగా కాల్చుకోండి. మీగడ సాయంతో ఇలా కాల్చుకోండి. కొబ్బరి రొట్టెలు రెడీ. రొట్టెలోకి ఏదైనా కాంబినేషన్ ఉండాలిగా.. ఇన్‌స్టెంట్ చట్నీ కూడా ఎలా చేయాలో చూద్దామా..!
చిన్న నాన్‌స్టిక్ పాత్రలో మీగడ వేసి పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి టమోటా ముక్కలు వేసి 5-6 నిమిషాలు మగ్గనించి.. మిక్సీజార్‌లో వేసి లైట్‌గా గ్రైండ్ చేసుకోండి. దీంతో కొబ్బరిరొట్టెలు తింటుంటే.. ఆహా.. నెక్ట్‌లెవల్ టెస్ట్..! ఓసారి మీరు కూడా ఇలాంటి స్నాక్ ఐటమ్ ట్రై చేయండి.!