ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. సీనియర్ల జీ23 పేరుతో కాంగ్రెస్ పార్టీ, గాంధీల నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సమూల ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. రేపు కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ నిర్వహించనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు సోనియాగాంధీ. పార్టీ ప్రక్షాళన, పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలపై చర్చ జరగనుంది. ఈనెల 31న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ముగుస్తుండటంతో దీనిపై కూడా చర్చించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో సభ్యత్వాలు ఎంత నమోదయ్యాయనే వివరాలు, దాని మీద సమీక్ష నిర్వహించనున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేఖ విధానాలపై ఆందోళనలపై దిశానిర్థేశం చేయనున్నారు. ఇటీవల పెరిగిన పెట్రోల్, డిజిల్, వంట గ్యాస్ ధరల పెంపుపై దేశ వ్యాప్త ఆందోళనకు కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.