ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపేందుకు వీలు లేదని అన్నారు. రైతు భరోసా పేరుతో రూ.15వేలు ఇస్తామని మాట తప్పారని మండిపడ్డారు .రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటీ? అంటూ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతుబంధు రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వమని విమర్శించారు.
పింఛన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఫైర్ అయ్యారు. విద్యుత్ బిల్లుల మాఫీ రాష్ట్రంలో అమలుకావడం లేదాని విమర్శించారు. కేబినెట్ సబ్ కమిటీ రైతులను మోసం చేయడానికి వేసిన కమిటీ అంటూ ఆయన ఆరోపించారు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమయ్యేదని ఆయన గుర్తు చేశారు.