– కేంద్రంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఫైర్
హైదరాబాద్ః కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే తీసుకువచ్చిందని ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఆరోపణలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన ఆ మూడు సాగు చట్టాలను రద్దు చేసేంత వరకూ పోరాడుతామని అన్నారు. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించారు.
ఈ నేపథ్యంలోనే సూర్యపేట జిల్లా కేంద్రంలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తున్నాయని విమర్శంచారు. అన్నదాతల మద్ధతును రెండు ప్రభుత్వాలు కోల్పోయాయని అన్నారు. కార్పొరేట్ల కోసమే వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకువచ్చిందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహబుబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, ఉమ్మడి మెదక్ , నల్గొండ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిచారు. ఆయా ప్రాంతాల్లో అక్కడి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.