కాంగ్రెస్ నేతలు వాళ్ళ వ్యాపారాల కోసం బిఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలంలో బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ కి వేసినట్లేనని విమర్శించారు. నాయకత్వ లోపం వల్లే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనపడింది అన్నారు. రేవంత్ రెడ్డి ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
బిఆర్ఎస్, బిజెపి ఎప్పటికీ ఒకటి కాదన్నారు. రిపబ్లిక్ డే వేడుకలు జరపకుండా కేసీఆర్ ఓ నియంతల వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కెసిఆర్ అసమర్ధ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని చెప్పారు. గవర్నర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాటలు ఆ పార్టీ తీరుకు అద్దం పడుతున్నాయి అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో చెప్పేందుకు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నిదర్శనం అన్నారు.