కాంగ్రెస్ ఆఫర్ ని ప్రొ. కోదండరాం తిరస్కరించారా ?

-

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్‌లో పోటీ ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్‌ను బరిలో దింపుతారని అనుకుంటున్నారు. అయితే పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ఎందుకు అని ప్రశ్నిస్తూనే నాన్‌లోకల్‌ అంశాన్ని కొందరు కాంగ్రెస్‌ నాయకులు చర్చకు పెట్టారట. ఇదంతా ఎందుకు ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు మద్దతిస్తే పోలా అనేవాళ్లు కూడా ఉన్నారట. కోదండరాం కి మద్దతిస్తాం సరే కానీ కండీషన్స్ అప్లై అంటున్నారట కాంగ్రెస్ నేతలు..కాంగ్రెస్ పెట్టిన కండీషన్ విన్న కోదండరాం సైతం షాక్ తిన్నారట…

తెలంగాణలో త్వరలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలు వీటిపై ఫోకస్‌ పెట్టాయి. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు మాత్రం కొలిక్కి రాలేదు. ఇంకా కొనసాగుతోంది. రెండు రోజుల క్రితమే అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నా.. ఎందుకో వాయిదా పడింది. పార్టీలోనే టికెట్‌ ఆశిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌ మద్దతు ఆశిస్తున్న మరికొందరు బయట నాయకులు ఉన్నారు. అందుకే పంచాయితీ తేలడం లేదన్నది గాంధీభవన్‌ వర్గాల టాక్‌.

ఖమ్మం-వరంగల్-నల్గొండ నుంచి ప్రో. కోదండరామ్‌కు మద్దతు ఇస్తే ఎలా వుంటుంది అని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించగా వద్దు మనమే అభ్యర్థిని దించుదాం అని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్న వారు కూడా ఉన్నట్టు సమాచారం. ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్న కోదండరామ్‌తోపాటు చెరుకు సుధాకర్‌లు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఆశిస్తున్నారు. కోదండరామ్‌, సుధాకర్‌ ఇద్దరూ సీరియస్‌ ఫైట్‌కు సిద్ధమవుతున్నారు.

కోదండరామ్‌ అయితే ప్రచారం మొదలుపెట్టేశారు. కాంగ్రెస్‌ మద్దతు ఆశిస్తున్నా.. సొంతంగా ఫైట్ చేయడానికి కూడా సిద్ధపడేలా ప్రణాళిక వీరి దగ్గర ఉందట. ఈ సందర్భంగా కోదండరామ్‌, చెరుకు సుధాకర్‌లకు కాంగ్రెస్‌ పార్టీ ఒక ఆఫర్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.అయితే పోటీ చేయాలంటే.. మద్దతు కాదు.. కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాలని కోదండరామ్‌కు సూచించారట తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. ఈ ఆఫర్‌కు నొచ్చుకున్న ప్రొఫెసర్‌.. అప్పటి నుంచి కాంగ్రెస్‌ మాట ఎత్తడం మానేశారట. కాంగ్రెస్‌ మద్దతు కోదండరామ్‌కు ఉండదని నిర్ధారించుకున్న చెరుకు సుధాకర్‌ .. ఆ పార్టీలోని బీసీ నాయకుల సాయంతో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోనే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. అలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో లేకపోతే రాంగ్ సిగ్నల్స్‌ వెళ్తాయని అభిప్రాయపడుతున్నారట. పార్టీకి కూడా నష్టం జరుగుతుందని చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మద్దతు ఎవరికో ఇచ్చుడు కంటే.. అభ్యర్థి మనవాడే అయితే బెటర్‌ అని ఆలోచిస్తున్నారట. అందుకే ఎవరు మద్దతు అడిగినా కండువా కప్పుకోవాలని ముందే చెబుతున్నారట టీ కాంగ్రెస్ నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version