తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంది. ఆరు గ్యారెంటీ లలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ పి.విజయ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఫిలింనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా విజయ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల కుట్రలను తిప్పికొడుతూ మహిళలకు ఎంతో లబ్ధిచేకూర్చే సబ్సిడీ గ్యాస్ ,గృహ జ్యోతి పథకాలను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించేలా కృషి చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆమె పిలునిచ్చారు.రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పథకాల పట్ల మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారని ,త్వరలోనే ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసే విధంగా ప్రభుత్వం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ఆమె అన్నారు.