గాలికిపోయే కంప‌ను నెత్తిన‌.. కాంగ్రెస్ తీరు అట్లుంట‌ది మ‌రి..!

-

కాంగ్రెస్ ను ఓడించ‌డం ఎవ‌రి త‌రం కాదు.. వారికి వారే ఓడించుకోగ‌ల స‌మ‌ర్థులు.. త‌మ కాళ్ల‌లో తామే క‌ట్టెలు పెట్టుకోవ‌డంలో సిద్ధ‌హ‌స్తులు. కాంగ్రెస్ గురించి త‌ర‌చూ వ్యంగ్యంగా వినిపించే వ్యాఖ్య‌లివి. స‌రే.. ఏదో ఆ పార్టీని విమ‌ర్శించాలి కాబ‌ట్టి అలా అంటారు అని కొట్టిపారేసేంద‌కు కూడా వీలులేద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే.నేత‌ల తీరు అట్లుంట‌ది. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు, ఒక‌రు ముందుకు వెళ్తున్నారంటే స‌రే.. ఆఘ‌మేఘాల మీద‌ ప‌గ్గ‌మేసి వెన‌క్కి లాగ‌డం ఆ పార్టీలో ష‌రా మామూలే. దేవుడే దిగివ‌చ్చి హిత‌బోధ చేసినా ఆ పార్టీ నేత‌లు మారుతార‌నే న‌మ్మ‌కం కూడా లేదు. ఏమైనా అంటే మా పార్టీలోని ప్ర‌జాస్వామ్యానికి ఇది గొప్ప నిద‌ర్శ‌నం అంటూ అర‌భీక‌ర‌ స‌మ‌ర్థింపులు కూడా ఉంటాయి. తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఫ‌లితాల‌ను మ‌నం చూశాం. కాంగ్రెస్ ప‌ని అయిపోయింద‌ని అనుకున్న స‌మ‌యంలో మూడు స్థానాల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ కు ఇంత శ‌క్తి ఉందా? అని అనుకునేలా చేసింది. ఇంకా గ‌ట్టిగా పోరాడితే మ‌రో మూడు స్థానాల్లోనూ గెలిచేద‌ని గ‌ణాంకాలు వెల్ల‌డించాయి.
అయినా.. ఆ పార్టీ నేత‌ల తీరు మార‌ట్లేదు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన రెండు ఉప ఎన్నిక‌ల్లో, జీ హెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ప‌నితీరును చూశాం. అయినా.. గ‌త కొద్ది రోజులుగా ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, అధిష్టానానికి ఫిర్యాదుల ప‌రంప‌రను చూస్తూనే ఉన్నాం, వీరి తీరుతో ఇప్ప‌టికే జ‌నంలో పార్టీపై స‌ద‌భిప్రాయం పోయింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఐక్య‌త‌లేని ఈ నేత‌లు బ‌ల‌మైన టీఆర్ ఎస్ తో.. మ‌రోవైపు బాణంలా దూసుకువ‌స్తున్నబీజేపీతో ఎలా యుద్దం చేస్తుంద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న.

ఇదంతా ప‌క్క‌న పెడితే అస‌లు ఒక రాజ‌కీయ వివాదం, అంశంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాల‌న్న స్ప‌ష్ట‌త కూడా నేత‌ల్లో క‌రువ‌యింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వ‌రి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో టీఆర్ ఎస్‌, బీజేపీలు క‌లిసి నాట‌కాలు ఆడుతున్నాయ‌ని, ఇద్ద‌రి ల‌క్ష్యం రైతుల‌ను మోసం చేయ‌డ‌మేన‌ని గ‌ట్టిగా విమ‌ర్శించి త‌మ వాద‌న‌ను వినిపించిన నేత‌లు మ‌రో రెండు వివాదాల్లో మాత్రం చేతులు కాల్చుకున్నార‌ని అంటున్నారు. అవ‌స‌రంలేకున్నా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, గ‌వ‌ర్న‌ర్ వివాదంలో అవ‌స‌రంలేకున్నా త‌ల‌దూర్చి.. బీజేపీకి మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ నాయ‌కులు మాట్లాడ‌ట‌మే గ‌మ్మ‌త్త‌యిన విష‌యం. దీనివ‌ల్ల ఎవ‌రికి లాభం? అనే క‌నీసం సోయి కూడా లేకుండా పోయింది. ఈ వివాదంలో అటు టీఆర్ఎస్ ను, ఇటు బీజేపీ తీరును ఎండ‌గ‌డితే కాంగ్రెస్ కు మైలేజీ వచ్చేది. అలా కాకుండా బీజేపీకి మ‌ద్దుతుగా మాట్లాడితే ఎవ‌రికి లాభం? ఆ మాత్రం తెలివిడి కూడా కాంగ్రెస్ నేత‌ల‌కు లేకుండా పోయింద‌ని సెటైర్లు వేస్తున్నారు.

ఖ‌మ్మంలో బీజేపీ కార్య‌క‌ర్త‌ ఆత్మ‌హ‌త్య విష‌యంలోనూ కాంగ్రెస్ నాయ‌కులు బీజేపీకి మ‌ద్ద‌తుగానే మాట్లాడారు. ఈ వివాదంలోనూ అదే తీరు.మ బీజేపీకి మ‌ద్ద‌తుగా ఆ పార్టీ ప‌ట్ల సానుభూతి పెరుగుతుంది త‌ప్ప కాంగ్రెస్ కు లాభ‌మా? అన్న‌ది కూడా ఆలోచించ‌డం లేదు. స‌రే.. వ‌రి స‌మ‌స్య ప్ర‌జ‌ల‌ది. ఈ వివాదంలో జోక్యం చేసుకోవ‌డం రైతుల‌కు మేలు చేస్తుంది. మ‌రి రెండు పార్టీల మ‌ధ్య వివాదంలో జోక్యం చేసుకోవ‌డం ఏమిటో? ఇది అవ‌స‌ర‌మా? అని ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఈ రెండు అంశాల‌ను చూస్తుంటే గాలికి పోయే కంప‌ను నెత్తిన వేసుకోవ‌డమ‌నే సాహ‌సం కాంగ్రెస్ నాయ‌కులు త‌ప్ప ఇంకెవ‌రూ చేయ‌రేమోన‌నే వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version