రైతుల ఆందోళనతో కామారెడ్డి రణరంగంలా మారింది. పట్టణ నూతన బృహత్ ప్రణాళికలోని పారిశ్రామిక జోన్‌లో సాగు భూములను చేర్చే ప్రతిపాదనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఇవాళ కామారెడ్డి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. కామారెడ్డిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి.
బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బీజేపీ నేత వెంకటరమణారెడ్డిని అర్ధరాత్రి గృహ నిర్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. కామారెడ్డిలో రైతు బంద్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. బంద్‌లో పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌పై ప్రజాక్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య జఠిలమైందని రేవంత్ ఆరోపించారు.