దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. దేశంలో రోజూ వారీ కేసుల సంఖ్య పెరిగింది. గతంలో రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 10 వేల లోపే ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య లక్ష, 2 లక్షలను దాటి 3 లక్షలకు చేరువ అవుతోంది. దీంతో రాష్ట్రాలు, కేంద్రం అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో పాటు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. మరోవైపు నైట్ కర్ఫ్యూలను కూడా విధిస్తున్నారు.
తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరిగాయి. తాజాగా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలంరేగింది. పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఎస్ఐ, ఏఎస్ఐ లతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మాస్క్ ఉంటేనే పోలీస్ స్టేషన్ లోకి అనుమతి ఇస్తున్నారు. ఫిర్యాదు దారుడు ఒక్కరు మాత్రమే లోపలకి రావాలని ఆంక్షలు విధించారు.