కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత భీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నిత్యం లక్షల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అనేక లక్షల మందికి రోజూ కొత్తగా కరోనా సోకుతోంది. ఈ క్రమంలో జనాలందరూ కరోనా వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే సులభంగా పోదని, దశాబ్దాల తరబడి అది ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ టెడ్రోస్ తెలిపారు.
గత 7 నెలల కిందట ప్రారంభమైన కరోనా మహమ్మారి ప్రభావం అంత త్వరగా తగ్గదు. అది కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది.. అని టెడ్రోస్ అన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా వల్ల 6.80 లక్షల మంది చనిపోయారు. 17.7 మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు.
అయితే కరోనా విషయంలో ప్రపంచాన్ని సరైన టైముకు హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కరోనా విషయంలో ఆ సంస్థ చైనాకు సహకరిస్తుందని ట్రంప్ మండిపడ్డారు. అందుకనే అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగింది. అయితే ఆయా ఆరోపణల వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రజల్లో తన నమ్మకాన్ని కోల్పోయింది.