ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. సీఎం జగన్‌ను ఓ తుగ్లక్‌తో పోలుస్తూ.. నిత్యం కామెంట్లు పెడుతున్నారు. ఈ మూడు రాజధానుల ఏర్పాటును ఏదో ఒక రూపంలో నిన్న మొన్నటి వరకు కూడా తీవ్రంగా అడ్డుకున్నారు. అయితే, అనూహ్యంగా ఈ బిల్లును గవర్నర్ ఆమోదించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. గవర్నర్ ఆమోదాన్ని కూడా కొందరు నేతలు, మీడియా చానెళ్లు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారే ఇలా చేస్తారా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. తమకు అనుకూలంగా రాజధాని విషయంలో గవర్నర్ సదరు బిల్లులను తిప్పిపంపలేదని నిప్పులు చెరుగుతున్నారు.
అయినప్పటికీ.. జగన్ కానీ, ఆయన మనుషులు కానీ ఎక్కడా ఈ విషయంపై కామెంట్లు చేయలేదు. ఇక, గవర్నర్ ఆమోదించారు. ఈ క్రమంలో జగన్‌కు తొలి ప్రశంస దక్కింది. జగన్ ఈజ్ బెస్ట్ సీఎం.. ఏపీకి మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉంది. విభిన్నమైన భౌగోళిక అంశాలు ముడిపడిన రాష్ట్రానికి మూడు రాజధానులతో ప్రయోజనం దక్కుతుందని పేర్కొంటూ.. ఏకంగా బ్రిటన్ నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కోసం ప్రవేశపెట్టిన బిల్లును గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదించిన విషయం తెలిసిన అనంతరం, తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ప్లెమింగ్ స్వాగతిస్తూ గొప్ప పరిణామంగా కొనియాడారు.
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఆ మూడు నగరాలు సంక్షేమ సౌభాగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. శాసన రాజధాని అమరావతి, పరిపాలన రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు నగరాలను సందర్శించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కరాళ నృత్యం తగ్గిన తర్వాత తప్పకుండా వీటిని సందర్శించేందుకు ఏపీకి వస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మూడు రాజధానుల బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ, కర్నూలు జిల్లాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. కానీ, ఎప్పటిలాగే.. చంద్రబాబు ఆయన పరివారం.. అనుకూల మీడియా కన్నీరుమున్నీరవుతున్నాయి!!