కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో సోమవారం (03-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు నిర్లక్ష్య ధోరణిని వీడాలని, కరోనాను కలసికట్టుగా ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. కరోనా బారిన పడి కోలుకున్న ప్రజా ప్రతినిధులు ప్లాస్మాను దానం చేసి ప్రజలకు ప్రేరణగా నిలవాలన్నారు.
2. మృతదేహాల నుంచి కరోనా వైరస్ సోకుతుందనే విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని షికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ అంటువ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ విజయ్ ఎల్దండి తెలిపారు. ఈ మేరకు ఆయన ఈ విషయంపై చేసిన పరిశోధనలు చేశానని తెలిపారు. సదరు వివరాలతో కూడిన నివేదికను ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌కు అందజేశారు.
3. తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 983 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 67,660కు చేరుకుంది. 48,609 మంది కోలుకున్నారు. 18,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 11,911 మంది ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 551 మంది చనిపోయారు.
4. భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇండియాకు వచ్చే ప్రయాణికులు సొంత ఖర్చులతో 7 రోజుల పాటు పెయిడ్ ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండాలి. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలను అమలు చేయనున్నారు.
5. కరోనా నియంత్రణకు గాను ఆవిరి చికిత్స (స్టీమ్ థెరపీ) బాగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముంబైలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ దిలీప్ పవార్ ఈ మేరకు పరిశోధనలు చేశారు. 105 మంది బాధితులను రెండు గ్రూపులుగా విభజించి వారికి ఆవిరి ద్వారా చికిత్స చేశారు. దీంట్లో సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు.
6. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ భారత్‌కు చేరుకుంది. మన దేశంలో దీన్ని ఫేజ్ 2, 3 దశల్లో పరీక్షించనున్నారు. ఇందుకు గాను పూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనుమతులు పొందింది.
7. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,972 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,03,695కు చేరుకుంది. ఒక్క రోజులోనే 771 మంది చనిపోయారు. మొత్తం 38,135 మరణాలు సంభవించాయి.
8. బీసీజీ టీకాలు తీసుకుంటున్న భారత్ వంటి దేశాల్లో ఆరంభంలో మొదటి 30 రోజుల పాటు కోవిడ్ వ్యాప్తి రేటు తక్కువగా ఉందని సైంటిస్టులు తేల్చారు. అమెరికాలో బీసీజీ టీకాలు తీసుకోవడం ఆపేశారని, అందుకనే అక్కడ కోవిడ్ వ్యాప్తి, మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బీసీజీ టీకాలు తీసుకుంటే కరోనా వస్తుందా, రాదా అనే అంశంపై ప్రస్తుతం వారు పరిశోధనలు చేస్తున్నారు.
9. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,822 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,66,586కు చేరుకుంది. 76,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 88,672 మంది కోలుకున్నారు. మొత్తం 1537 మంది చనిపోయారు.
10. కరోనా వైద్యం పేరిట ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును వసూలు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ హాస్పిటల్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. కోవిడ్ చికిత్సకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో హాస్పిటల్‌కు అనుమతులను రద్దు చేశారు.