తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్ చార్జీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఆ రెండు బాధ్యతలను ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కి అదనంగా అప్పగించారు. రెండు చోట్లా పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేంత వరకూ ఈయనే బాధ్యతలు నిర్వర్తిస్తారని రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
సీపీ రాధాకృష్ణన్ ఇప్పటికే హైదరాబాద్ లోని రాజ్ భవన్ కి చేరుకున్నారు. బుధవారం ఉదయం 11.15 గంటలకు రాజభవన్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. సీపీ రాధాకృష్ణన్ 2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.
తనకు తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు అప్పగించినందుకు సీపీ రాధాకృష్ణన్ సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఎక్స్ లో పోస్ట్ చేశారు.