పూణెకు చెందిన ఓ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కార్డ్ క్లోనింగ్ ముఠా బారిన పడ్డాడు. దీంతో రూ.1.30 లక్షలు పోగొట్టుకున్నాడు. అతని డెబిట్ కార్డును క్లోనింగ్ చేసిన ఒక ముఠా విడతల వారీగా ఆ కార్డు ద్వారా నగదు విత్ డ్రా చేశారు. దీంతో అతని అకౌంట్‌లో ఉన్న మొత్తం సొమ్ము లూటీ అయింది. వివరాల్లోకి వెళితే…
పూణెలోని యెరవాడ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న జమీల్ రహమాన్ షేక్ నవంబర్ 1న తన డెబిట్ కార్డుతో షాపింగ్ చేశాడు. అయితే ఆ కార్డును షాపులో పనిచేస్తున్న ఎవరో క్లోనింగ్ చేశారు. ఆ విషయం అతనికి తెలియదు. అనంతరం అతను స్థానికంగా ఉన్న షర్బత్‌వాలా చౌక్‌లోని ఓ ఏటీఎం నుంచి కొంత నగదును విత్ డ్రా చేశాడు. తరువాత తన ఫోన్ రిపేర్ రావడంతో అందులోని సిమ్ కార్డును తీసి ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చాడు. నవంబర్ 4న ఫోన్‌ను తిరిగి తీసుకుని అందలో సిమ్ వేసి చూడగానే ఒక్కసారిగా అతనికి అనేక మెసేజ్‌లు వచ్చాయి. తన అకౌంట్‌లో ఉన్న సొమ్ము మొత్తం ఖాళీ అయిందని, విడతల వారీగా నగదు విత్‌డ్రా అయిందని గుర్తించాడు.
మొత్తం 33 ట్రాన్సాక్షన్ల ద్వారా 4 రోజుల్లో దుండగులు నవంబర్ 1 నుంచి 4వ తేదీల మధ్య షేక్ అకౌంట్ నుంచి రూ.1.30 లక్షలు విత్‌డ్రా చేశారు. ఏటీఎంలలో రూ.4వేలు, రూ.9వేలు, రూ.10వేలు ఇలా చిన్న చిన్న మొత్తాల్లో మొత్తం నగదును కాజేశారు. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అలర్ట్ మెసేజ్ లు ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో వచ్చేసరికి షాకయ్యాడు. దీంతో అతను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఏమిటీ కార్డ్ క్లోనింగ్ ?
మన దగ్గర ఉండే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను మనం పీవోఎస్ మెషిన్లలో స్వైప్ చేసినప్పుడు ఆ మెషిన్లకు అమర్చబడే ప్రత్యేక పరికరాల ద్వారా మన కార్డుల సమాచారం సేకరిస్తారు. అనంతరం మన కార్డులను పోలిన కార్డులను వారు తయారు చేస్తారు. వాటి ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తారు. దీంతో మన ప్రమేయం లేకుండానే వారు మన కార్డు ద్వారా నగదు విత్ డ్రా చేసుకుంటారు. అయితే దీన్ని నివారించాలంటే సెక్యూరిటీ చిప్ కలిగిన కార్డులనే వాడాలి. అలాగే కార్డులను మన కళ్లెదుటే స్వైప్ చేయమని అడగాలి. ఒక వేళ మన బ్యాంకు ఖాతా నుంచి మనకు తెలియకుండా ఎవరైనా నగదు విత్ డ్రా చేస్తే వెంటనే మనకు మెసేజ్ ఎలాగూ వస్తుంది కాబట్టి ఫోన్‌ను మనం ఆన్ చేసి ఉంచాలి. మెసేజ్‌లను పరిశీలించాలి. మోసం జరిగిందని భావిస్తే వెంటనే కార్డులను బ్లాక్ చేయాలి. దీంతో కార్డ్ క్లోనింగ్ బారి నుంచి తప్పించుకోవచ్చు.