పండగపూట విషాదం.. ముగ్గుల ఫోటో తీస్తూ జారి పడిన బాలిక మృతి..

-

సంక్రాంతి పండగ అంటే.. ఆడవాళ్లకు పిండివంటలు, ముత్యాల ముగ్గులు, ఫోటోలు, వీడియోలో ఇవి ఆనందం..ఇక మగమహారాజులకు అయితే.. కోడిపందాలు, జూదం, పతంగుల హడావిడీ.. అయితే ఈ పండుగ అప్పుడే చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి.. కొన్ని కుటుంబాల్లో విషాదం మిగులుతుంది..అపార్టుమెంట్‌ ముంగిట వేసిన ముగ్గుల ఫొటోలు తీస్తుండగా జారి పడి ఓ బాలిక మృతిచెందింది. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడలో జరిగింది..

పోలీసుల వివరాల ప్రకారం… కిన్నెర అనే బాలిక తొమ్మిదో తరగతి చదవుతోంది. కాప్రా పరిధిలోని సాధనవిహార్‌ కాలనీ, ఆవాస్‌ అపార్టుమెంట్లో ఉంటున్నారు. శనివారం బోగి పండుగ సందర్భంగా అపార్ట్‌మెంట్‌ ఆవరణలో వేసిన ముగ్గులను ఐదో అంతస్తునుంచి సెల్‌ఫోన్‌లో ఫొటో తీయాలనుకుంది. ఈ క్రమంలోనే జారి కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు..

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

జాగ్రత్తగా ఉండండీ అనీ పోలీసులు వారం ముందు నుంచే మొత్తుకుంటున్నారు.. అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. మరోవైపు పతంగులు ఎగురవేస్తున్న క్రమంలో మాంజా తగిలి పక్షులు చనిపోతున్నాయి.. విద్యుత్‌ లైన్లతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు.. విద్యుత్ లైన్ల, ట్రాన్స్ ఫార్మర్ల, సబ్ స్టేషన్ల వద్ద ఎగురవేయడం ప్రమాదకరం. ఒక వేళ పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్ల పై, ఇతర విద్యుత్ పరికరాలపై పడితే విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

కాటన్, నైలాన్, లినెన్ తో చేసిన మాంజాలను మాత్రమే వాడాలి.. మెటాలిక్ మాంజాలు వాడొద్దు. మెటాలిక్ మాంజాలు విద్యుత్ వాహకాలు కనుక అవి లైన్లపై పడ్డప్పడు విద్యుత్ షాక్ కలిగే అవకాశం ఉంది. పొడి వాతావరణంలో మాత్రమే పతంగులు ఎగురవేయాలి. తడి వాతావరణంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.

Read more RELATED
Recommended to you

Exit mobile version