ఘరానా మోసం.. ప్లాట్ల బిజినెస్‌ పేరిట రూ.156 కోట్లు వసూలు..!

-

ప్లాట్ల బిజినెస్‌ పేరిట 1450 మంది కస్టమర్ల నుంచి రూ.156 కోట్లు వసూలు చేసిన ఓ వ్యక్తిని, అతనికి సహకరించిన మరో ఇద్దరిని సైబరాబాద్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ మేరకు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

రఘు యార్లగడ్డ అనే వ్యక్తి స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌, స్వధాత్రి రియల్టర్స్‌ పేరిట మూడు కంపెనీలను నెలకొల్పాడు. వాటికి గాను హైదరాబాద్‌ మాదాపూర్‌, శ్రీనగర్‌ కాలనీలలో రెండు ఆఫీసులను తెరిచాడు. ఆయా కంపెనీలను స్థానికంగా రిజిస్టర్‌ కూడా చేయించాడు. అయితే తన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల ద్వారా అతను ప్రజలకు 3 స్కీములను ఆఫర్‌ చేశాడు.

ఒక స్కీంలో రూ.1 లక్ష పెడితే 9 శాతం వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. కానీ ఏడాది పాటు కచ్చితంగా పెట్టుబడి మొత్తాన్ని ఉంచాలని చెప్పాడు. దీంతో నమ్మిన కొందరు కస్టమర్లు ఈ స్కీంలో పెట్టుబడి పెట్టారు. ఇందులో మొత్తం 950 మంది నుంచి రూ.87 కోట్లను అతను వసూలు చేశాడు. ఇక రెండో స్కీంలో ప్లాట్లపై పూర్తి మొత్తం పెట్టుబడి పెడితే ఏడాది పాటు నెల నెలా 4 నుంచి 10 శాతం ఆదాయం ఇస్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఈ స్కీం ద్వారా 300 మంది నుంచి అతను రూ.42 కోట్లు వసూలు చేశాడు. ఇక మూడవ స్కీంలో.. ప్లాట్‌ మొత్తంలో 70 శాతం వరకు ముందే చెలిస్తే రిజిస్ట్రేషన్‌ ఫీజు, జీఎస్‌టీ ఉండదని చెప్పాడు. దీంతో ఇందులో 200 మంది పెట్టుబడి పెట్టారు. వారి నుంచి రూ.27 కోట్లను అతను వసూలు చేశాడు. ఈ క్రమంలో మొత్తం 1450 మంది నుంచి రూ.156 కోట్లను రఘు వసూలు చేశాడు.

ఇక రఘు తన కంపెనీలను నిర్వహించేందుకు, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు, స్కీంలలో వారిని చేర్పించేందుకు గాను 30 మంది ఏజెంట్లు, 20 మంది టెలికాలర్లను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇతని ఉచ్చులో పడి మోసపోయామని గ్రహించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టి ఎట్టకేలకు రఘును అరెస్టు చేశారు. ఇక ఇతనిపై తెలంగాణలో మాత్రమే కాక, అటు ఏపీలోని విజయవాడలోనూ పలు కేసులు నమోదయ్యాయి. వాటిని కూడా హైదరాబాద్‌కే బదిలీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version