దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరాన్ని సైక్లోన్ నిసర్గ ముంచెత్తింది. తుఫాన్ ధాటికి అక్కడ ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం 1 గంట తరువాత మహారాష్ట్రలోని అలీబాగ్‌లో తుఫాన్ తీరం దాటింది. దీంతో అక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తుఫాన్ ప్రభావం వల్ల అటు గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.
నిసర్గ తుఫాన్ ముంబై మహానగరాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పటికే కరోనా వల్ల కుదేలవుతున్న ఆ నగరాన్ని తుఫాన్ అస్తవ్యస్తం చేసింది. ఈ క్రమంలో నగరంలో అనేక చోట్ల తుఫాన్ పెను విధ్వంసాన్ని సృష్టిస్తోంది. అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. స్తంభాలు విరిగి పడ్డాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో స్థానికులు అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ఇప్పటికే నగరంలో పలు చోట్ల రోడ్లకు చెట్లు అడ్డంగా కూలడంతో అనేక మంది ఫిర్యాదులు చేశారు. మొత్తం 96 వరకు చిన్న చిన్న బృందాలు రోడ్లపై కూలిన చెట్లను తొలగిస్తాయి. ఇప్పటి వరకు ముంబైలో లోతట్టు ప్రాంతాల నుంచి మొత్తం 10వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.