యమునా నగర్‌కు చెందిన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. కుమార్తె 18 ఏళ్ల వయస్సు దాటి ఆరోగ్యంగా ఉంటే ఆమె విడిగా ఉండదలిస్తే ఆమెకు తండ్రి ఎలాంటి డబ్బులు నెల నెలా చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి నేహా నౌహారియా తీర్పు చెప్పారు. ఓ కేసు విషయమై యమునానగర్ సీజీఎం కోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ నేహా ఆ విధంగా తీర్పు ఇచ్చారు.
రమేష్ చంద్ర అనే వ్యక్తి ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. వయస్సు 70 సంవత్సరాలు. భార్య, కుమార్తె ఉన్నారు. అయితే ముగ్గురూ విడివిడిగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన భార్య ఖర్చులకు నెలకు రూ.1000 ఇస్తున్నారు. అయితే కుమార్తె కూడా తనకు నెలకు రూ.3వేలు ఇవ్వాలని యమునానగర్‌లోని సీజేఎం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆ కోర్టుల ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
అయితే సీజేఎం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రమేష్ చంద్ర ఏడీజేను ఆశ్రయించారు. దీంతో ఏడీజే సంచలన తీర్పు ఇచ్చారు. కుమార్తె మేజర్ అయి ఉండి, అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండి, చదువుకుని ఉంటే తన కాళ్లపై తాను నిలబడాల్సిందేనని, తండ్రి నెల నెలా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని సంచలన తీర్పు చెప్పారు.
మానసిక అనారోగ్య సమస్యలు లేదా ఇతర ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, మేజర్ కాకపోయినా, సొంతంగా సంపాదించుకోలేకపోయినా.. అలాంటి వారికి మాత్రమే ఖర్చులకు నెల నెలా డబ్బులను ఇవ్వాల్సి ఉంటుందని ఏడీజే తీర్పు చెప్పారు. దీంతో రమేష్ చంద్ర హర్షం వ్యక్తం చేశాడు.