ఐపీఎల్ లో ప్లే ఆఫ్ సందడి షురూ అయింది. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు రసవత్తర పోరు జరగనుంది. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ బెర్తుపై కన్నేసిన ఇరుజట్లు…తాడోపేడో తేల్చుకోనున్నాయి. రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్ దక్కించుకునేందుకు రోహిత్ సేన పటిష్ట బలగంతో బరిలోకి దిగుతుంటే..తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్న ఢిల్లీ, ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలని కసితో ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌లో శిఖర్ ధవన్ రెండు సెంచరీలతో ఊపుమీదున్నా… మిగతా ఆటగాళ్లు ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోవడం… ఆ జట్టుకు సమస్యగా మారింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రహానే ఫర్వాలేదనిపిస్తున్నా… బలమైన ముంబై బౌలింగ్ ముందు ఢిల్లీ ఏ మాత్రం నిలబడగలదోనని అనుమానాలున్నాయి. అయితే బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండటం… ఢిల్లీకి కాస్త ప్లస్ పాయింట్.
ఇక ముంబై టీం విషయానికి వస్తే గత మ్యాచ్ లో రోహిత్ విఫలమైనా… క్రీజ్‌లో కుదురుకుంటే రోహిత్‌ను ఏ బౌలర్ అడ్డుకోలేడు. ఇషాన్ కిషన్, డికాక్, సూర్య కుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. చివర్లో హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, కృనాల్ మెరుపులు తోడైతే… పరుగుల వరద పారినట్టేనని ముంబై నమ్మకంగా ఉంది. ఓడిన జట్టు… రేపు హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగే ఎలిమినేష్ మ్యాచ్ విజేతతో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడి… ఫైనల్‌కు వెళ్లే అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.