షార్జాలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 23వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. ఆరంభంలో వెంట వెంటనే వికెట్లను కోల్పోయిన ఢిల్లీ తడబడినా.. వెంటనే తేరుకుంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ విజృంభించి ఆడారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో షిమ్రాన్ హిట్‌మైర్, స్టాయినిస్‌లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. 24 బంతుల్లోనే 1 ఫోర్, 5 సిక్సర్లతో హిట్‌మైర్ 45 పరుగులు చేయగా, స్టాయినిస్ 30 బంతుల్లో 4 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 17 పరగులు చేసి జట్టుకు మరిన్ని పరుగులు జోడించాడు. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు రాజస్థాన్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా, కార్తిక్ త్యాగి, ఆండ్రూ టై, తెవాతియాలు తలా 1 వికెట్ పడగొట్టారు.