కరోనా అగ్రరాజ్యం అమెరికా లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ మహమ్మారికి అక్కడ వేలాది మంది జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ కరోనా కు సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేకుండా కరోనా సోకడం తో ప్రతి ఒక్కరూ కూడా ఆసుపత్రికి పారిపోతున్నారు. అమెరికాలోని న్యూయార్క్,న్యూజెర్సీ,కాలిఫోర్నియా,మిచిగాన్,ఫ్లోరిడా, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, వాషింగ్టన్,లూసియానా,పెన్సిల్వేనియా,జార్జియా,టెక్సాస్ తదితర రాష్ట్రాల్లో ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుంది. రోజురోజుకీ యూఎస్‌లో ఈ ‘కొవిడ్-19’ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. అయితే తాజాగా డెమొక్రటిక్ ప్రైమరీ లో న్యూయార్క్ 12 వ కాంగ్రెషనల్ సీటు కోసం బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన సూరజ్ పటేల్ కు కరోనా పాజిటివ్ తేలినట్లు సోషల్ మీడియా తో పాటు బ్లాగ్ ద్వారా తెలిపారు. న్యూయార్క్‌లోని 12 కాంగ్రెషనల్ స్థానంలో ఇప్పటికే ఆ పదవిలో ఉన్న కరోలిన్ మలోని స్థానాన్ని కైవసం చేసుకునేందుకు సూరజ్ డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీలో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.10 రోజుల క్రితం తనకు ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, 102 డిగ్రీల జ్వరం వచ్చిందని ఆయన తన ప్రకటనలో తెలిపాడు. తాను ప్రస్తుతం ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. అందుకే తామంతా కోలుకొని వరకు స్వీయ నిర్బధంలోనే ఉండనున్నట్లు సూరజ్ చెప్పారు.
2008 నవంబర్ ఎన్నికల సమయంలో సూరజ్ పటేల్ నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రచార బృందంలో పనిచేయగా, ఇలా కాంగ్రెషనల్ స్థానం కోసం ఆయన బరిలోకి దిగడం ఇది రెండవసారి. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంంలో మాస్టర్స్ డిగ్రీ, న్యూయార్క్ వర్సిటీ స్కూల్ ఆఫ్ లా గ్రాడ్యుయేట్స్‌లలో సూరజ్ ఉన్నత విద్యను అభ్యసించారు.