పల్లకీలు మోసే వారే కావాలి
కానీ వారికి అందలం అక్కర్లేదు
పాపం వాళ్లు ఏళ్లకు ఏళ్లు పార్టీ జెండా మోస్తారు
కానీ అధికారం మాత్రం ఏ ఒక్కరి గుప్పిటనో ఉంది
కార్యకర్తలను నిత్యం నిరాశకు గురిచేస్తుంటుంది ?
ఈ దశలో టీడీపీ కానీ వైసీపీ కానీ గుర్తించాల్సింది
గౌరవం అందించాల్సింది కార్యకర్తలనే అన్న విషయం మరువకూడదు.
రాళ్లెత్తిన కూలీలు కార్యకర్తలు. వాళ్లు కష్టపడితేనే పార్టీకి మేలు. ఏ పార్టీకి అయినా వారసులను ప్రోత్సహించినంతంగా దిగువ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహించదు. కొత్త వారు ఎవ్వరయినా వారంతా పల్లకీలు మోసే బోయిలుగానే ఏళ్లకు ఏళ్లు కష్టపడాలి. ప్రభుత్వంలో వారి చోటు ఇవ్వరు. పార్టీ పదవుల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వరు. కుటుంబ పాలనలో పెరిగి పెద్దయిన వైసీపీ కానీ టీడీపీ కానీ కొత్త వారిని ప్రోత్సహించిన దాఖలాలే అరుదు. ఈ దశలో రాజకీయాల్లో యువత రావాలి..ఎక్కడో ఉండి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు అంటూ చంద్రబాబు నిన్నటి వేళ కీలక వ్యాఖ్య చేశారు. పార్టీలో సీనియర్లను గౌరవిస్తాను. వారు నడుస్తారు. కానీ పరుగులు తీయాలంటే యువతకే సాధ్యం అని చెప్పారు.
ఇప్పటిదాకా ఈ మాట చంద్రబాబు చెప్పలేదు. అంటే పార్టీలో ఏదో జరుగుతోంది అన్నది స్పష్టం అయిపోయింది. వైసీపీ వచ్చే ఎన్నికల్లో యాభై నుంచి అరవై సిట్టింగ్ స్థానాలలో అభ్యర్థులను మార్చనుంది. కొత్త ముఖాల కోసం ఎదురు చూస్తోంది. వెతుకుతోంది కూడా! ఎలానూ ఎన్నికల వ్యయం అధినేత జగనే చూసుకుంటారు కనుక పార్టీకి చెందిన స్థానిక నాయకత్వం కూడా ఇలాంటి వెతుకులాటలోనే ఉంది. ఇదే సమయంలో జగన్ కు దీటుగా తనవంతుగా వంద మందిలో ఓ నలభై మంది కొత్త వాళ్లకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది లేదా ఆ విధంగా ఓ ప్రకటన చేస్తే క్యాడర్ నుంచి వచ్చే వినతులు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు బాబును వెన్నాడుతున్న ఆలోచనలు. ఓ విధంగా పార్టీ ప్రక్షాళన కు కూడా ఇలాంటి నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా పొలిటికల్ మైలేజ్ ను సులువుగా పెంచుకోవచ్చు కూడా!