ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. స్వదేశాన్ని వీడినా భారత మూలాలను మాత్రం వారు మరిచిపోవడం లేదు.ఈ క్రమంలోనే దీపావళి పండుగను పురస్కరించుకుని అమెరికాలోనే అతిఎత్తైన భవనం వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను విద్యుత్ వెలుగులతో సరికొత్తగా తీర్చిదిద్దారు. అక్టోబర్ 31న దీపావళిని పురస్కరించుకుని విభిన్న విద్యుత్ కాంతులతో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను అలంకరించారు.
ప్రకాశవంతమైన విద్యుత్ దీప కాంతులతో ఆ భవనం జిగేల్‌మని మెరుస్తోంది. దీంతో అక్కడి పర్యాటకులు, న్యూయార్క్ వాసులు ఆ భవనాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇది ఇరుదేశాల ఐక్యత, వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. పిరమిడ్ ఆకారంలో ఉండే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్.. ఆరెంజ్, పసుపు, బ్లూ కలర్ లైట్లతో మిరుమిట్లు గొలుపుతోంది. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్‌గా పిలుచుకునే దీపావళిని పురస్కరించుకుని భవనాన్ని కలర్ ఫుల్ లైట్లతో అలంకరించారు. కాగా, చీకటిపై కాంతి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని పండుగను జరుపుకుంటారు.