రేవంత్‌ రెడ్డే సీఎం.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే శివకుమార్‌

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. అయితే.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలపై మొదటి సంతకం చేస్తారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తాండూరులో నిర్వహించిన విజయభేరి యాత్రలో ఆయన మాట్లాడుతూ… ప్రజల బలమే కాంగ్రెస్, కాంగ్రెస్ బలమే దేశ బలం అన్నారు. కర్ణాటకలో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ నేరవేర్చామన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అని ప్రశ్నించారు.

కర్ణాటకలో తాము ఐదు హామీలు ఇచ్చి నెరవేర్చామని, ఇక్కడ తెలంగాణలో ఆరు హామీలు ఇచ్చామని, వాటిని కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఈ ఆరు సూత్రాల్లో మహాలక్ష్మి కూడా ఉందని, మహిళలకు కర్ణాటకలో వలె ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు తాను సవాల్ విసురుతున్నానని, ఇక్కడి నుంచి పది కిలో మీటర్లు వస్తే కర్ణాటక వస్తుందని, మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు నేనే బస్సు పెడతానని, అప్పుడు కర్ణాటకకు వచ్చి మేం విద్యుత్ ఎలా ఇస్తున్నామో… ఐదు హామీలు ఎలా అమలు చేస్తున్నామో చూడవచ్చునని సవాల్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, స్థలాలు లేనివారికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఎల్బీ స్టేడియంలో ఆరు పథకాలపై మొట్టమొదటి సంతకం పెడతారన్నారు. కాంగ్రెస్ పక్కా అధికారంలోకి వస్తుందని, డిసెంబర్ 9న పదిన్నర గంటలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశామని చెప్పారు. చివరగా ఒక మాట చెబుతున్నానని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ఆయన కుటుంబం ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటుందని డీకే శివకుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version