కరోనా మహమ్మారి.. లక్షల మంది ప్రజలను చంపేసింది.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను, ప్రజల జీవన విధానాలను అతలాకుతలం చేసింది. ఎన్నో కోట్ల మందికి ఉపాధిని దూరం చేసింది. ఉద్యోగాలు కోల్పోయి బతుకులు వీధిన పడేలా జీవనాన్ని మార్చింది. ఇంకా ఎన్ని రోజులు ఈ వైరస్ ప్రభావం ఉంటుందో తెలియదు. తలలు పండిన మేథావులే.. కరోనా వైరస్ వ్యాప్తి ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందో చెప్పలేకపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో.. ఆ వైరస్‌తో మనం సహజీవనం చేయక తప్పదా..? అంటే.. అందుకు పలువురు విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు.
కరోనా వైరస్‌కు సంబంధించి వ్యాక్సిన్ ఇంకా తయారు కాలేదు. అందుకు మరో 8 నుంచి 10 నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అప్పటి వరకు ఎలా..? లాక్‌డౌన్‌ను అప్పటి వరకు పెంచలేం కదా.. కానీ తాజాగా నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే.. కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతుందా..? లేదా..? అన్న అనుమానం కలుగుతుంది. కరోనాకు భయపడి లాక్‌డౌన్‌ను పెంచుకుంటూ పోతే.. పేదలు ఆకలితో చనిపోవడం ఖాయం.. సగం వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడడం ఖాయం. ప్రజలు ఆర్థిక శక్తి, దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేనంతగా పడిపోతాయి. అలా అని చెప్పి లాక్‌డౌన్ తీసేస్తే.. కరోనా మహమ్మారి మనల్ని వెంటాడుతుంది. మరిప్పుడు ఏం చేయాలి..?
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపడుతున్న వేళ.. దాంతో సహవాసం చేయడం తప్ప మనకు మరొక మార్గం లేదని నిపుణులు, మేథావులు, విశ్లేషకులు అంటున్నారు. అయితే మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం పెంచడం, సోషల్ డిస్టాన్స్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం.. వంటి చర్యలు చేపడితే.. లాక్‌డౌన్ లేకపోయినా.. వైరస్‌ను కట్టడి చేయడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. న్యూజిలాండ్, హాంగ్‌కాంగ్ వంటి దేశాలు ఈ దిశగా సక్సెస్ సాధించాయి కూడా. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇదే తరహాలో మార్గదర్శకాలను అమలు చేయనుందా..? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
న్యూజిలాండ్, హాంగ్‌కాంగ్ వంటి దేశాల్లో కరోనా కట్టడి అయిందంటే.. అది కేవలం ప్రభుత్వాల ఘనతే కాదు, ప్రజలు కూడా కచ్చితమైన క్రమశిక్షణ పాటించారు. ప్రభుత్వాల సూచనలను, రూల్స్‌ను తూచా తప్పకుండా విన్నారు. క్రమశిక్షణగా నడుచుకున్నారు. కనుకనే ఆయా దేశాల్లో కరోనా కట్టడి సాధ్యమైంది. కానీ భారత్‌లో అది సాధ్యమవుతుందా..? అనేదే ప్రశ్న. కానీ ప్రభుత్వాలు తలచుకుంటే.. నిజంగా ఆ తరహా విధానాలను అమలు చేయడం అంత కష్టమేమీ కాదు. నిబంధనలను పాటించకుంటే క్వారంటైన్‌కు తరలిస్తామనో లేదా భారీ ఫైన్లు వేస్తామనో, కేసులు పెడతామనో హెచ్చరిస్తే.. జనాలు కొంత వరకు మాట వినేందుకు అవకాశం ఉంటుంది.
అయితే ఒక్కటి మాత్రం సత్యం.. కరోనాకు భయపడి లాక్‌డౌన్‌ను పెంచుకుంటూ పోతే.. దేశానికి, రాష్ట్రాలకూ ఏమాత్రం మంచిది కాదనే మాట వాస్తవం. అందుకని.. వైరస్‌తో సహజీవనం చేస్తూనే.. దాంతో పోరాడాలి. శత్రువుకు భయపడి దాక్కోవడం కాదు.. శత్రువుతోనే తిరుగుతూ.. శత్రువును అంతం చేయాలి.. శత్రువును సమర్థవంతంగా నిర్మూలించేందుకు అవసరం అయిన చర్యలు తీసుకోవాలి. అదీ.. ఇప్పుడు ప్రభుత్వాలు అనుసరించాల్సిన వ్యూహం. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే 3 తరువాత ఏం చేస్తాయో చూడాలి..!