చ‌క్క‌ని బిజినెస్ ఐడియా.. దీన్ని ప్రారంభిస్తే కేంద్రం నుంచి 3.75 ల‌క్ష‌లు ఇస్తారు..!

-

క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అనేక మంది ప‌నిలేక సొంత ఊళ్ల‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇక మళ్లీ ప‌నుల‌ను ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతాయో.. ప‌ట్ట‌ణాలు, న‌గరాల‌కు మ‌ళ్లీ ఎప్పుడు వెళ్తామోన‌ని చాలా మంది ఆందోళ‌న చెందుతున్నారు. అయితే అలాంటి వారి కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఓ చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. అదేమిటంటే…

గ్రామాల్లో స్వ‌యం ఉపాధిని పొందాల‌ని అనుకునే వారి కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ఒక స్కీంను ప్ర‌వేశ‌పెట్టింది. అదే.. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీం. ఇందులో భాగంగా ఔత్సాహికులు త‌మ త‌మ గ్రామాల్లో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఉపాధి పొంద‌వ‌చ్చు. సాయిల్ టెస్టింగ్ అంటే.. మ‌ట్టి ప‌రీక్ష‌లు అన్న‌మాట‌. గ్రామాల్లో రైతుల పంట‌లు పండే పొలాల్లోని మ‌ట్టిని ప‌రీక్ష‌లు చేయ‌వ‌చ్చు. దాంతో ఉపాధి ల‌భిస్తుంది.

ఇక సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.5 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతాయి. అందులో 75 శాతం వ‌ర‌కు.. అంటే.. దాదాపుగా రూ.3.75 ల‌క్ష‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేస్తుంది. మిగిలిన మొత్తాన్ని అభ్య‌ర్థులు భ‌రించాల్సి ఉంటుంది. ఇక దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ చాలా త‌క్కువ సంఖ్య‌లో ఉన్నాయి. అందువ‌ల్లే వీటి సంఖ్య‌ను పెంచాల‌ని కేంద్రం ఆలోచిస్తోంది. ఇక ఈ ఉపాధిని ఎంచుకున్న వారు చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. గ్రామాల్లో ఉన్న వారు ఈ ప‌థ‌కానికి అర్హులు.

18 నుంచి 40 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగిన వారు ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకుని స్వ‌యం ఉపాధి పొంద‌వ‌చ్చు. సాధార‌ణంగా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌తి 2 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి రైతుల పొలాల్లో మ‌ట్టి ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు మ‌ట్టి ప‌రీక్ష‌లు (సాయిల్ టెస్ట్‌) నిర్వ‌హిస్తాయి. ఈ ల్యాబ్‌ల స‌హాయంతో ఆ ప‌రీక్ష‌లు చేయ‌వ‌చ్చు. దీంతో నేల‌ల్లో ఏయే పోష‌కాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుంటుంది. త‌ద్వారా రైతులు తాము పండించే పంట‌ల‌కు పోష‌కాల‌ను అందించి మ‌రింత దిగుబ‌డి సాధించ‌వ‌చ్చు.

ఇక సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌ల‌లో ఒక్కో శాంపిల్‌ను టెస్ట్ చేసి హెల్త్ కార్డు ఇస్తే రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.300 ఇస్తుంది. ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాల‌నుకునే వారు జిల్లా డిప్యూటీ డైరెక్ట‌ర్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్‌, జాయింట్ డైరెక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. లేదా agricoop.nic.in, soilhealth.dac.gov.in అనే వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. వాటిల్లో అభ్య‌ర్థుల‌కు కావ‌ల్సిన స‌మాచారం ల‌భిస్తుంది.

అలాగే 1800 180 1551 అనే కిసాన్ కాల్ సెంట‌ర్ టోల్ ఫ్రీ నంబ‌ర్‌కు కాల్ చేసి కూడా స‌మాచారం తెలుసుకోవ‌చ్చు. ఈ ల్యాబ్‌ల‌ను గ‌ది అద్దెకు తీసుకుని పెట్ట‌వ‌చ్చు. లేదా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ రూపంలో ఏదైనా వాహ‌నంలో కూడా పెట్ట‌వ‌చ్చు. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ అయితే నేరుగా రైతుల వ‌ద్ద‌కే వెళ్లి సాయిల్ టెస్టుల‌ను చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version