గురు పౌర్ణమి.. ఈ జపం చేస్తే గురు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది..!

-

మనిషి పుట్టింది మొదలు అనేక సందర్భాల్లో అనేక మంది గురువుల వద్ద అనేక విషయాలను నేర్చుకుంటుంటాడు. మొదట తల్లిదండ్రులు గురువులుగా మారి మాటలు, నడక నేర్పిస్తే.. ఆ తరువాత గురువులు మనకు విద్యాబుద్ధులు నేర్పి మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తారు. ఆ తరువాత జీవితమనే గురువు మనకు నిత్యం పాఠాలు నేర్పిస్తుంది. అయితే మనిషి ఏ రంగంలో రాణించాలన్నా, అనుకున్నది సాధించాలన్నా.. అందుకు గురువు మార్గదర్శకత్వం, శిక్షణ తప్పనిసరి. ఈ క్రమంలోనే గురువు మనకు అనేక విషయాలను బోధించి మనల్ని ప్రగతి పథంలో నడిపిస్తాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అన్నారు. అంటే.. కృష్ణుడు గీత ద్వారా మనకు ఎన్నో విషయాలను బోధించాడని అర్థం. ఈ క్రమంలోనే గురు పౌర్ణమి సందర్భంగా మనల్ని ఉన్నత స్థాయిలో నిలిపిన గురువులను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది.

ఆషాఢ శుద్ధ పూర్ణిమనే వ్యాసపూర్ణిమ, గురు పూర్ణిమ, గురు పౌర్ణమి అంటారు. నవగ్రహాలలో గురుగ్రహం కూడా ఒకటి. దేవతలకు గురువు బృహస్పతి. అందుకే గురు గ్రహాన్ని బృహస్పతి గ్రహం అని కూడా పిలుస్తారు. సూర్యుడి నుంచి గురు గ్రహం 5వ స్థానంలో ఉంటుంది. ఇతర గ్రహాలకన్నా ఈ గ్రహం బరువు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లిష్‌లో గురు గ్రహాన్ని జూపిటర్ అని పిలుస్తారు. రోమన్ దేవతైన జూపిటర్ పేరు మీదుగా గురు గ్రహాన్ని జూపిటర్ అని పిలుస్తున్నారు. గురుగ్రహం తన చుట్టూ తాను తిరిగి రావడానికి సుమారుగా 9.50 గంటల సమయం పడుతుంది. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 11.86 సంవత్సరాల కాలం పడుతుంది. గురుగ్రహానికి 16 ఉపగ్రహాలు ఉన్నాయి. గురుగ్రహం చూసేందుకు మనకు పసుపు పచ్చ రంగులో కనిపిస్తుంది.

గురువు అంటే సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమే. గురువు తన శిష్యులలో ఉండే అజ్ఞానాంధకారాలను తొలగిస్తాడు. శిష్యులకు ఆయన జ్ఞానాన్ని, వెలుగును ప్రసాదిస్తాడు. పురాణాల ప్రకారం దేవతల గురువు బృహస్పతి కాగా.. ఆయన సప్తరుషుల్లో ఒకడైన అంగీరసుడి పుత్రుడు. బృహస్పతి బాల్యంలోనే మహా పండితుడిగా కీర్తింపబడ్డాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యాడు. వేదాలను అవపోసన పట్టి, శాస్ర్తాలను లోతుగా పరిశీలించి అన్ని విధాలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.

బృహస్పతి పరమేశ్వరున్ని పూజించి ఆయన మెప్పు పొందాడు. అందుకనే గురువారం బృహస్పతిని స్మరిస్తూ నామకరణం చేయబడింది. ఈ క్రమంలో బృహస్పతి మానవుల ప్రవర్తనను నిర్దారించే నవగ్రహాల్లో ఒకటిగా మారింది. బృహస్పతిని వాచస్పతి అని కూడా అంటారు. ఈయన గురువులకే గురువుగా ఖ్యాతి గడించాడు.

గురుగ్రహం మనకు అనుకూలించాలన్నా, మనం తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావాలన్నా.. అందుకు గురుగ్రహాన్ని మనం పూజించాలి. ఈ క్రమంలోనే గురుగ్రహం అనుగ్రహం పొందేందుకు భక్తులు ఈ కింది కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.

* గురుగ్రహం అనుగ్రహానికి భక్తులు శనగలు దానమివ్వాలి. 16వేల సార్లు గురుధ్యాన శ్లోకం జపించాలి. గురుదక్షిణామూర్తి, దత్తాత్రేయ, విష్ణువులను ఈ సందర్భంగా ఆరాధించాల్సి ఉంటుంది. అలాగే పసుపు వస్త్రం ధరించాలి. రవి సమిధలలో హోమం చేయాలి. పుష్యరాగ రత్నాన్ని ధరించాలి. రుద్రాక్ష అయితే పంచముఖి రుద్రాక్ష ధరించాలి. అలాగే పూజలు, జపాలు, హోమం, దానం, రత్నధారణ విధిగా చేయాలి. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయ ఆరాధాన చేస్తే శుభం కలుగుతుంది. అలాగే శ్రీహయగ్రీవాయనమః అనే జపం చేసుకున్నా అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు ఈ జపం చేస్తే అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి. ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం సందర్భంగా జ్ఞానం కావాలనుకుంటే ముందు చెప్పిన హయగ్రీవ జపం చేయాలి. దాన్ని గ్రహణ సమయంలో చేయాల్సి ఉంటుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version