విదేశాలలో శివరాత్రి విశేషాలు తెలుసా !

-

శివరాత్రి కేవలం భారత్‌లో మాత్రమే కాదు దేశదేశాలలో ఈ పండుగను నిర్వహించుకుంటారు. హిందూ సంప్రదాయం మనదేశంలో మాత్రమే కాక, ఇతర దేశాలలో కూడా వెల్లివిరుస్తోంది. దీనికి కారణం అక్కడ నెలకొని ఉన్న మన హిందూ దేవాలయాలే. కింద పేర్కొన్న దేవాలయాలే కాకుండా అమెరికా సంయుక్త రాష్టారలలో, ఇతర దేశాలలో పలుచోట్ల శివాలయాలు, బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో అనేక చోట్ల శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలు తెలుసుకుందాం…

నేపాల్ లో పశుపతినాథ్ ఆలయం:

అతి పురాతన దేవాలయాలలో ఇది ఒక దేవాలయం. దీనిని జయదేవుడు 753 AD లో కట్టించాడని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ శివుడిని పశుపతినాథ్ అంటారు. పశుపతి అంటే పశువులకు అధిపతి. నేపాలీలు ఈ ఆలయ నిర్మాణానికి 600 సంవత్సరాల కాలం పట్టిందట, 60 మంది రాజుల ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తయ్యిందట. మళ్ళీ 17వ శతాబ్దంలో దీనిని పునర్నిర్మించారట. ఇక్కడ శివలింగం మీటరు ఎత్తులో ఉండి, లింగానికి నాల్గువైపులా నాల్గు ముఖాలుంటాయట. ఈ గర్భగుడికి నలుదిక్కులా నాలుగు ద్వారాలు ఉంటాయి, ప్రదక్షిణ చేస్తూ లింగానికి ఉన్న నాలుగు ముఖాలని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ శిల్పకళ నేపాలి పగోడా శైలిలో ఉంటుంది. శివరాత్రి రోజున ఇక్కడ శివుడికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ దేవుడిని దర్శించుకుంటే సకల రోగాల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాదు పశుపతినాథ్‌ స్మరణతో పశుపాశ బంధాల నుంచి జీవి విముక్తుడు అవుతాడని పండితులు పేర్కొంటున్నారు.

పాకిస్తాన్‌లో:

పాకిస్తాన్ లో శివాలయం ఏంటా అని ఆశ్చర్యపోకండి, ఇది కొత్తగా ఈ శతాబ్దంలో నిర్మించిన ఆలయం కాదు మహాభారత కాలం నుంచి భక్తుల పూజలు అందుకుంటున్న మహోన్నత ఆలయం. ఇది పాకిస్తాన్ లోని లాహోర్ కి సమీపంలో చక్వాల్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలోని శివుడిని కటస్ రాజ్ అని అంటారు. అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఇక్కడ బస చేసి శివుడిని ఆరాధించారని ప్రతీతి. దక్ష యజ్ఞంలో ప్రాయోపవేశం చేసిన సతీదేవి కోసం శివుడు కార్చిన కన్నీరు రెండు గుండాలుగా ఏర్పడిందట. ఒకటి మన దేశంలోని పుష్కర్ లో ఉండగా మరొకటి ఇక్కడ పాకిస్తాన్ లోని ఈ శివాలయంలో ఉంది. ఇక్కడ శివరాత్రి రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందంట.

మారిషస్‌లో :

తూర్పు మారిషస్ లో ఉన్న సాగర శివ ఆలయాన్ని 2007 లో నిర్మించారు. రాగితో చేసిన 108 అడుగుల శివుని విగ్రహం మారిషస్ మొత్తానికే ప్రత్యెక ఆకర్షణగా, పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది. ఈ విగ్రహం, మనదేశంలోని గుజరాత్ దగ్గర వదోదరాలో ఉన్న శివుని విగ్రహాన్ని పోలి ఉంటుంది. ఇది ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద శివుని విగ్రహాలలో రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ శివుడిని మంగళ మహదేవ్ అని పిలుస్తారు. సముద్రతీరంలో ఉండటం వలన సాగర శివ ఆలయంగా పేరుపొందింది. ప్రస్తుతం అంతే ఎత్తులో దుర్గాదేవి విగ్రహాన్ని కూడా నిర్మిస్తున్నారు. శివరాత్రి నాడు చుట్టుప్రక్కల ప్రాంతాలవారు వారి ఇళ్ళ నుండి కాలినడకన ఇక్కడికి చేరుకుంటారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులకి మంచినీరు, ఆహరం అందించి తమ భక్తిని చాటుకుంటారు. శివరాత్రి రోజున దాదాపుగా 3,00,000 మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారట.

ఇండోనేషియాలో:

ఇక్కడి శివాలయం ఇండోనేషియలోనే కాదు దక్షిణ తూర్పు ఆసియాలోనే అతిపెద్ద దేవాలయంగా పేరుపొందింది. ఇక్కడ శివుడిని ప్రభంనన్ …… అంటే పరబ్రహ్మన్, “పరమోత్తమమైన బ్రాహ్మణుడు” అని అర్థం. ఇది కేవలం శివాలయం మాత్రమే కాదు ఇక్కడ బ్రహ్మ- విష్ణు – మహేశ్వరులు ముగ్గురూ పూజలందుకుంటారు. గర్భగుడి గోపురం 47 మీటర్ల ఎత్తుగా ఉంటుందిట. నిజానికి ఇలాంటి ఆలయాలు దాదాపుగా 240 వరకు ఉండేవట. కాని ప్రస్తుతానికి అన్నీ సిథిలావస్థకి చేరుకున్నాయి. ఇక్కడ ఉన్న హిందువులంతా శివరాత్రికి ఈ ఆలయాన్ని చేరుకొని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

శ్రీలంకలో:

శ్రీలంకలో కొలువుతీరిన ఈ ఆలయం అతిపురాతన శివాలయం. రామాయణ కాలం నుండి ఈ ఆలయం ఉన్నట్టు ప్రతీతి. రావణుని జయించిన తరువాత రాముడు ఇక్కడ శివలింగానికి పూజలు చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ ప్రాంగణంలో అయిదు ప్రధాన కోవెలలు కనిపిస్తాయి. వాటిమధ్యలో ఎత్తైన గోపురం ఉన్నదే శివాలయం. ఇక్కడ శివరాత్రి ఎంతో వైభవంగా జరుగుతుంది. బంగారాన్ని కొల్లగొట్టడానికి పోర్చుగీసు వాళ్ళు రెండుసార్లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసారట.

మస్కట్ లోని మోతీశ్వర్ మందిర్:

మస్కట్ లోని సీబ్ విమానాశ్రయానికి 35 Km దూరంలో, సుల్తాన్ ప్యాలెస్ కి దగ్గరలో ఈ ఆలయం ఉంది. దీనిని సుమారు 109 ఏళ్ళ క్రితం గుజరాత్ నుండి వ్యాపార నిమిత్తమై అక్కడికి వెళ్ళిన హిందువులు నిర్మించారు. 1999 లో మళ్ళీ కొన్ని మార్పులు చేసి పునర్నిర్మించారు. ఇక్కడ శివుడిని మోతీశ్వర్ అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే హనుమంతుడు, గణపతి అల్లయాలు కూడా ఉన్నాయి. మన దేశంలో లాగానే ఇక్కడ కూడా వసంత పంచమి, శ్రీరామనవమి. గణపతి నవరాత్రులు, హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా నిర్వహిస్తారట.

ఆస్ట్రేలియాలో:

శివ విష్ణు ఆలయం.. ఈ ఆలయం ఆస్ట్రేలియాలోని మెల్ బార్న్ నగరంలో ఉంది. ఆలయ నిర్మాణానికి 1986లో శంఖుస్థాపన చేసినా, 1994 నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. దీని ప్రారంభోత్సవానికి కాంచీపురం నుంచి, శ్రీలంక నుంచీ పండితులని ఆహ్వానించారట. హిందూ – ఆస్ట్రేలియన్ సంస్కృతుల సమ్మేళనంగా ఉంటుంది ఇక్కడి శిల్పకళ. ప్రధాన ఆలయంలోనే 32 మంది దేవతల ఉపాలయాలు ఉన్నాయి. శివరాత్రితో పాటు హోలీ, దీపావళిని కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈవిధంగా మన దేశంలోనే కాకుండా మన హిందూ దేవతలకి విదేశాలలో కూడా విశేష పూజలు జరగటం
మనకెంతో గర్వకారణం.

మలేషియాలో:

అలుర్ మిగు శ్రీరాజకలైమన్ ఆలయం ఈ ఆలయాన్ని 1992లో నిర్మించారు. జోహోర్ అనే రాజు హిందువులకు కానుకగా ఇచ్చిన స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయాన్ని మొత్తం అద్దాలతో, గాజు సామగ్రితో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలో ఉన్న గోడలని మూడులక్షల రుద్రాక్షలతో అలంకరించారట. శివరాత్రినాడు హిందువులంతా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరి విశేషంగా పూజలు నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version