అనుకున్నదంతా అయింది.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచీ ఊహిస్తూ వస్తున్నట్లుగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో అన్ని సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తొలుత ఆ సంస్థకు నిధులను నిలిపివేసిన ట్రంప్ ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌కు చైనాయే కారణమని, ఆ దేశానిఇకి ప్రపంచ ఆరోగ్య సంస్థ అండగా ఉంటుందని మొదట్నుంచీ వాదిస్తున్న ట్రంప్ లోలోపన భగ్గుమంటూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అన్ని దేశాలను షాక్‌కు గురి చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థతో అన్ని సంబంధాలను రద్దు చేసుకున్నామని, ఆ సంస్థతో తెగదెంపులు చేసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్నుంచీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని, చైనాతో లాలూచీ పడి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని ట్రంప్ ఆరోపించారు. అలాగే తాము కోరి ఎన్నో సంస్కరణలను అమలు చేయడంలోనూ ఆ సంస్థ విఫలమైందని ట్రంప్ అన్నారు. చైనా కోరినట్లే కరోనా వైరస్‌పై ప్రపంచాన్ని ఆ సంస్థ అప్రమత్తం చేయలేదని అందువల్ల ప్రపంచం ఇప్పుడు తీవ్రంగా నష్టపోయిందని ట్రంప్ అన్నారు.
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించాల్సిన 400 మిలియన్ల డాలర్ల సహాయాన్ని ఇతర ఆరోగ్య సంస్థలకు అందజేస్తామని కూడా ట్రంప్ తెలిపారు. చైనా వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని, అమెరికాలో కరోనా మృత్యుహేళకు చైనాయే కారణమని ఆరోపించారు. చైనా చేసిన తప్పు వల్ల ప్రపంచం బాధపడుతుందన్నారు. కరోనా వైరస్ పై ప్రపంచాన్నని తప్పుదోవ పట్టించాలంటూ చైనాయే ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెచ్చిందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థతో తమ దేశానికి ఉన్న అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నామని ట్రంప్ తెలిపారు. కాగా మరో వైపు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు గట్టి షాక్ తగిలింది.