హైదరాబాద్ మహానగరంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో రోడ్లపై ఎక్కడ చూసినా భారీగా వరద పేరుకుపోతోంది. దీంతో సామాన్య ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి తోడు డ్రైనేజీల్లోకి వరద నీరు చేరడంతో అక్కడక్కడా పెద్ద ఎత్తున సివరేజ్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీంతో మురుగు నీరంతా రోడ్లపై పొంగిపొర్లుతోంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కాలనీ వాసుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
మంచి నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణపై అధికారులు, కార్మికులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సివరేజ్ ఓవర్ ఫ్లో విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఎండీ సీరియస్ అయ్యారు.వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి సిబ్బంది సేవలపై ఆరా తీసినట్లు సమాచారం.