తెలంగాణ విద్యాశాఖ నేడు ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రేపు డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ దరఖాస్తు ప్రక్రియకు నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్ ఫలితాలను సైతం ప్రకటించిన నేపథ్యంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తులు మొదలయ్యాయి.
రాష్ట్రంలోని పలు కాలేజీల్లో ఉన్న బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. అయితే విద్యార్థులు ఈ నోటిఫికేషన్ ఆధారంగా కాలేజీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. నేడు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. ఈ సారి కూడా బాలికలు విజయ దుందుభి మోగించారు.