ఈ నెల 24 నుండి ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో విడుత కౌన్సెలింగ్ మొదలుకానుంది. మొదటి విడుత కౌన్సెలింగ్ పూర్తి అయిన విషయం తెలిసిందే, అయితే ఈ నెల 16న సీట్లను కేటాయించారు. మొదటి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 23వ తేదీ వరకు అవకాశం ఉంది. జులై 24 నుంచి రెండో విడుత కౌన్సెలింగ్ మొదలుపెడతారు. జులై 24, 25 తేదీల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమ సమాచారాన్ని పొందుపరిచి, ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. జులై 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. 27న సీట్లను ఫ్రీజ్ చేయనుండగా, ఈ నెల 31న సీట్లను కేటాయిస్తారని సమాచారం.
మొదటి విడుత కౌన్సెలింగ్‌లో మొత్తం 173 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 82,666 సీట్లుండగా, మొదటి విడుతలోనే 70,665 సీట్లు కేటాయించారు. ఇప్పుడు 12,001 సీట్లు మిగిలి ఉన్నాయి. వీటిని రెండో విడుత కౌన్సిలింగ్‌లో భర్తీచేస్తారు. మొదటి విడుతలో సీట్లు పొందిన వారు ట్యూషన్ ఫీజు చెల్లించని పక్షంలో ఆయా సీట్లు రద్దయినట్లుగా భావించి, వాటిని రెండో విడుత కౌన్సెలింగ్‌కు బదిలీ చేస్తారు. దీంతో రెండో విడుతలో కేటాయించే సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.