ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవలే టర్కీ, సిరియాల్లో భూకంపాలు సృష్టించిన విధ్వంసాన్ని ప్రపంచ దేశాలు కళ్లారా చూశాయి. వేల మంది ప్రాణాలు కోల్పోవడం చూసి కన్నీళ్లుపెట్టుకున్నాయి. ఆ దేశాలకు తమ వంతు సాయంగా రెస్క్యూ టీమ్‌లను కూడా పంపాయి.
అయితే ఆ దేశాల్లో భూకంపం వచ్చిన తర్వాత కొందరు పరిశోధకులు చేసిన పరిశోధనలో మరికొన్ని దేశాల్లోనూ త్వరలోనూ భూకంపాలు సంభవించే ప్రమాదముందని తేలినట్లు సమాచారం. ఆ దేశాల్లో భారత్‌కూడా ఒకటి. ఈ ఆందోళనలో ఉండగానే ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌లో స్వల్ప భూప్రకంపనలు పెను భయాన్ని సృష్టించాయి.
పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి తదితర గ్రామాల్లో ఉదయం 7.26 గంటలకు భూమిలో శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. భూప్రకంపనలు రావడంతో పులిచింతల ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు