దిల్లీ సర్కార్ తీసుకువచ్చిన నూతన మద్యం వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో దూకుడు పెంచిన ఈసీ దేశవ్యాప్తంగా సోదాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో రెండో సారి సోదాలు నిర్వహించింది.
దిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో 10రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు రెండోసారి సోదాలు జరిపారు. దేశవ్యాప్తంగా 40చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు జరిపారు. తెలుగు రాష్ట్రాలు సహా చెన్నైలోని 23 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి చెందిన సంస్థలు ఉన్నాయి. దిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు బృందాలుగా ఏర్పడి.. స్థానిక అధికారుల సహకారంతో ఈ సోదాల్లో పాల్గొన్నాయి.
ఈ వ్యవహారమంతా రాజకీయంగా సంచలనం రేపుతుండటంతో దిల్లీ ఈడీ అధికారులు ఈ మొత్తం తతంగాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. స్థానిక ఈడీ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. ముందుగానే ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించుకోవాలో తెలుసుకుని వచ్చిన అధికారులు శుక్రవారం సరాసరి తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లారు. స్థానిక అధికారులను కూడా తమతో తీసుకువెళ్లినా వారిని కేవలం అవసరమైన దస్త్రాలు రాయించడానికి మాత్రమే వినియోగించారు.