పసుపు జెండాల మధ్య నిన్నటి వేళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైభవోపేతంగా జరిగింది. నలభై వసంతాల టీడీపీ ఘన చరితను ఒకటికి వందసార్లు తల్చుకున్నారు కార్యకర్తలు మరియు నాయకులు.నాయకులు ఎలా ఉన్నా సరే అంతా ఒకే వేదికపై వచ్చి తమ తమ ఆనందాలను సభా ముఖంగా పంచుకుని వెళ్లారు. ఇదే సమయంలో పార్టీ కష్టకాలంలో ఉందన్న మాటను మాత్రం ఎవ్వరూ ఒప్పుకోలేదు. కానీ రానున్న కాలంలో తామే అధికారంలోకి రానున్నాం అన్న ధీమా మాత్రం లోకేశ్ వ్యక్తం చేశారు.ఇదే ధీమా అన్నింటా కనిపించింది. మంచిది ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉంటే మంచిది!కానీ అందుకు తగ్గ పరిణామాలు ఉన్నాయా లేదా అన్నదే సందేహం.
ఎలా లేదన్న జగన్ ఇవాళ దూసుకుపోతున్నారు. ఆయన్ను కాదని టీడీపీ చెప్పే ఏ మాట కూడా జనం వినడం లేదు. ముఖ్యంగా నెలకో సంక్షేమ పథకం అంటూ కొన్ని సార్లు రెండు మూడు సంక్షేమ పథకాలకు కూడా నిధులు విడుదల చేస్తూ సంబంధిత వర్గాలను సంతోష పెడుతున్నారు. సంక్షేమ క్యాలెండర్ ను క్రమం తప్పక పాటిస్తున్నారు. అందుకే టీడీపీ నిన్నటి వేళ ఏ కొత్త పథకం గురించి ఊసెత్తలేదు. ఇక ఊసెత్తబోదు. ఇక పాలన పరంగా నాటి రోజులను తల్చుకుని మాట్లాడడమే తప్ప ముందున్న కాలంలో చేసేదేంటో స్పష్టత లేదు. కేవలం వ్యక్తిగత కక్షలకే ప్రాధాన్యం ఇస్తూ లోకేశ్ మాట్లాడడం విడ్డూరం. అవన్నీ మీడియా మీట్లలో మాట్లాడినవే!
ఆఖరుగా..పార్టీలోకి కొత్త రక్తం ఎక్కిస్తామని, నలభై శాతం మంది యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పి సంబంధిత వర్గాల్లో ఆశలు రేపారు. ఇదొక్కటే నిన్నటి వేళ చెప్పుకోదగ్గ విషయం.ఈ నిర్ణయం విని సీనియర్లు ఏమని అనుకున్నారో కానీ ఓ విధంగా ఇది మంచి ఆలోచనే ! ఇప్పటికే చాలా మంది సీనియర్లు అస్త్ర సన్యాసం చేసే స్థితిలో ఉన్నారు కనుక కొత్త వారిని తీసుకుని వారిని
ప్రోత్సహిస్తే పార్టీకి మరియు ప్రజలకు ఏక కాలంలో మేలు.