యుద్ధం చేయాలన్న యావ తప్ప మరో ఆలోచన లేని సందర్భం ఒకటి ఉంది. యావ ఉంటే చాలదు.. శక్తి కావాలి. మాట్లాడే శక్తి ఒక్కటే చాలదు నిలువరించే శక్తి మరియు ప్రజా బలం కావాలి. జనాకర్షణ ఒకటి ప్రధాన లక్షణం కావాలి. యుద్ధంలో యోధుడిగా రాణించాలంటే చాలా అంటే చాలా ఒత్తిళ్లకు తలొగ్గి ఉండాలి. ఇవేవీ చేయకుండా ఎవ్వరూ ఈ రణ రంగాన దూసుకుపోలేరు. అందుకే బలమైన రాజకీయ శక్తికి ఎదురు నిలిచి పోరాటం చేయడంలో టీపీసీసీ కాస్త వెనుకంజలోనే ఉంది. ఆ మాటకు వస్తే ఒక్కడే మాట్లాడి, మిగతా వారంతా కలలు అన్నీ అధికారం కోసం కేటాయించడం కూడా సబబు కాదు.ఈ నేపథ్యాన ప్రగతి భవన్ రాజకీయాలకు కౌంటర్లు ఇచ్చే పని రేవంత్ ఒక్కడే ఒన్ మ్యాన్ షో తో చేయడం తగని పని ! కానీ తప్పడం లేదు.
ఈ నేపథ్యాన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడొక ఒంటరి పోరుకు సిద్ధం అవుతూ ఉంది. ఆ క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యం ఏ మేరకు ఫలితాలు ఇవ్వనున్నదో అన్న సందేహాలూ నెలకొని ఉన్నాయి. పార్టీ అధిష్టానం నుంచి పెద్దగా సహకారం కూడా లేకున్నా కూడా పోరాటం చేయడంలో ఓ విధం అయిన విభిన్న శైలిని ఎంచుకునేందుకు ఇప్పుడు రేవంత్ ఆసక్తితో పాటు సంబంధిత ఆర్థిక వనరులూ పోగేసేందుకు సిద్ధం కావాలి. సీనియర్ లీడర్లు ఓ వైపు, రేవంత్ ఓ వైపు కనుక అనుకున్నవన్నీ సాధ్యమా ?
వాస్తవానికి ఎప్పటి నుంచో రేవంత్ ఒక్కరే ఒన్ మ్యాన్ షో చేస్తున్నారు. మిగిలిన నయా నాయకులు కానీ పాత తరం పెద్దలు కానీ యాక్టివ్ గా లేరు. రేవంత్ దూకుడు కారణంగా కొన్ని సమస్యలు ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ను పార్టీకి వినియోగపడేలా పనిచేసేందుకు రేవంత్ ఉత్సాహంతో ఉన్నారు. కానీ అవి చాలడం లేదు.
చాలీ చాలని శక్తితో రేవంత్ పనిచేస్తున్నారు. అందుకే ఆయన ఒకింత అసహనంతో ఊగిపోతున్నారు. సొంత పార్టీ నేతలు కొందరు అధికార పార్టీకి దగ్గరగా పనిచేస్తున్నారు అన్న వివాదాలు కొన్ని ఉన్నాయి. విభేదాలతో కూడిన వాదనలు ఉన్నాయి.
అందుకే ఆయన ఎప్పటికప్పుడు తనంతట తానే ఏదో ఒక వివాదాన్ని నెత్తిన పెట్టుకుని రేవంత్ అనే లీడర్ ఉన్నాడ్రా అని అనిపించుకునే క్రమంలో మరింత బలోపేతం అయ్యేందుకు స్వీయ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యాన తన నైజంలో భాగంగా త్వరలో ప్రగతి భవన్లో కేసీఆర్ ను కలుస్తానని అంటున్నారు. ఆయనతో భేటీ అయి అన్ని విషయాలూ చర్చిస్తానని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇంతవరకూ ఏ తెలంగాణ కాంగ్రెస్ నేత చెప్పని విధంగా ఆయన చెబుతున్నారు కొన్ని మాటలు. ఈ రాష్ట్రం బాగుండాలంటే, బాగు పడాలంటే ఏంచేసేందుకు అయినా సిద్ధమేనన్నది రేవంత్ మాట. ఆ మాటకు అనుగుణంగా ఆయన కార్యాచరణ ఉండనుంది అని తేలిపోయింది. ‘ తెలంగాణను కాపాడుకునేందుకు ఎటువంటి శషబిషలు లేకుండా ప్రగతిభవన్‌కు నేనే వస్తా’ అని పేర్కొంటూ లేఖాస్త్రం సంధించారాయన.