అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం అని ప్రతీ సందర్భంలో యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు. అందుకు సంబంధించి కార్యాచరణ కూడా షురూ చేస్తున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు సాయం అందించడంలో ముందుంటూ ముందుగా నిర్దేశించుకున్న ప్రభుత్వ లక్ష్యాలను చేరుకుంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా జాలర్ల కుటుంబాలు ఏ విధంగా జీవనం సాగిస్తాయో మనందరికీ తెలుసు.
గంగ పుత్రుల కష్టాలు, తీవ్ర తుఫానులు దాటి వారు జీవించే విధానం అన్నీ అన్నీ ఎప్పటికీ ఆసక్తిదాయకం అదేవిధంగా ఆ కష్ట జీవుల జీవన సూత్రం స్ఫూర్తిదాయకం. అందుకే ఎప్పటికప్పుడు వారి కష్టాలు తీర్చడం ఓ బాధ్యతగా చేసుకుని తమ ప్రభుత్వం ఉందని చెబుతూ సీఎం జగన్ పనిచేస్తున్నారని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొంత కాదు చాలా వరకూ లైఫ్ అండ్ డెత్ సిట్యువేషన్ లో భాగంగా జీవన సాగించే మత్స్యకారులకు ప్రభుత్వాలు మరింత ఊతం అందించాలి. అందుకు ఇవాళ్టి వైఎస్సార్ మత్స్యకార భరోసా ఓ ఉదాహరణగా నిలవాలి అని కోరుకుంటున్నాయి సంబంధిత వర్గాలు.
రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,08,755 కుటుంబాలకు వేట నిషేధ సమయంలో (లీన్ మంత్స్ అంటారు వాటిని)ఏప్రిల్ 15 నుంచి జూన్ 1 వరకూ సంబంధిత కాల పరిమితిలో ఇంటి దగ్గర ఉండి జీవన సాగించే విధంగా ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయలు సాయం అందించనున్నారు. గత ప్రభుత్వ సాయం ఏడు వేల రూపాయలే అయితే ఈ ప్రభుత్వం వచ్చాక దానిని పదివేలకు పెంచారు. వరుసగా నాలుగేళ్లుగా ఈ సాయం నిరాటంకంగా అందిస్తూ వారి బతుకులకు భరోసా ఇస్తున్నామని, ఈ లెక్కన ఇప్పటి వరకూ 418 కోట్ల రూపాయలు అందించామని సీఎం అంటున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి కోనసీమ జిల్లాకు రానున్నారు. మురమళ్ల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఓఎన్జీసీ ద్వారా కూడా కొంత సాయం ఇప్పిస్తున్నారు. కోనసీమ ప్రాంతంలో ఆ సంస్థ చేపడుతున్న పైప్ లైన్ పనుల కారణంగా భృతి కోల్పోయిన వారికి నాలుగు నెలల పాటు ఆర్థిక ఆసరా దొరికే విధంగా ముఖ్యమంత్రి చొరవ చూపించారు.
ఆయన చొరవ ఫలితంగా కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన 69 గ్రామాలకు చెందిన 23 వేలకు పైగా మత్స్యకార కుటుంబాలకు నెలకు 11,500 రూపాయల చొప్పున అందించేందుకు నాలుగు నెలలకు సంబంధించి 46 వేల రూపాయలు అందించనున్నారు. అంటే ప్రభుత్వ సాయంతో పాటు అదనంగా ఓఎన్జీసీ సాయం కూడా వీరికి అందనుంది. మత్స్యకార భరోసా కింద ప్రభుత్వం తరఫున 109 కోట్లు, ఓఎన్జీసీ తరఫున 108 కోట్లు మొత్తం 217 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అందనుంది.