చెడ్డ కాలాలు
చెడ్డ దూరాలు
మంచి స్నేహాలు
చెడ్డ కాలాలు కారణంగా మనుషులు చెడిన వారు అయిపోతున్నారు. చెడి బతికి మంచి విలువల పాటింపు మాత్రం చేయడం లేదు.రాజకీయంలో కూడా చెడి బతికి మంచి విలువలను కాపాడేందుకు ప్రయత్నించడం లేదు.చెడ్డ దూరం అన్నది ఒకటి తప్పక ఉండాలి. అవును! మృత్యు సంబంధిత కాలం చెడ్డ దూరం చెంతనే ఉండాలి. మృత్యువు ఏదయినా సరే అది దూరంగానే ఉండాలి. చెడ్డ దూరం అని ఎందుకు అంటున్నా అంటే వాటికి అనుగుణంగా జీవితం ఉంటే మంచి కొంత కాలం అయినా మనకు సమీపించి ఉంటుంది అని..సమీపించే మంచి సమీపించని చెడు ఈ రెండూ జీవితాలకు ఎందుకనో అత్యంత అవసరం అయి ఉన్నాయి..ఇవాళ రేపు కూడా! మంచి స్నేహం కూడా అత్యవసరం కాలంతో స్నేహం కూడా అవసరం అయి ఉండాలి. చెడు స్నేహాలు వద్దు చెడు కాలాలు వద్దు గాయం చేసి ప్రాణం తీసి విషాదాలను వరాలుగా కూర్చిన కాలం వద్దే వద్దు..ఆ సందర్భాలకు ఓ వెలివేత తప్పని సరి! మృత్యు దేవత ఆవాహన చెంత మనుషులు అర్థం లేని నవ్వు నవ్వుతున్నారు. ఎంత తప్పో వీళ్లకు తెలుసా? ఆ మాటకు వస్తే అందరి కన్నా విపక్ష నేత ఎంతో హుందాగా ఉన్నారు.
ఆయన్నుంచి నేర్చుకోదగ్గది ఇదే!
ఆంధ్రావనిలో ఇంకా రోజులు మంచివి కావడం లేదు.అంటే మంచి వార్తలేవీ మోసుకుని రావడం లేదు.ముఖ్యంగా మనుషుల్లో హుందాగా ప్రవర్తించడం, చావుకు గౌరవం ఇవ్వడం, బతుక్కి విలువ ఇవ్వడం చేతగావడం లేదు.మంత్రి గౌతమ్ రెడ్డి మన మధ్య లేరు. వారే కాదు వారు ఆచరించినవి విలువైనవి ఏవీ మన మధ్య లేవు. వారికి నివాళి ఇస్తూ ఇస్తూ మంత్రులు ఏం చేస్తున్నారని? వారికే కాదు వెళ్లిన వారికి ఎవ్వరికైనా నివాళి ఇస్తూ ఇస్తూ ఏం నేర్చుకుంటున్నారని? అందరి కన్నా చిన్నవాడు అందరి కన్నా పెద్దవాడు ఇలా ఏదో ఒకటి నిర్థారించుకుని చావు వేళ మాట్లాడుకుంటారు.మృత్యు సంహితలు ఎలా ఉన్నాయో ఆరా తీస్తారు.రాజకీయంలో వివాదాలకు అతీతంగా ఉన్న మరణాలు అరుదు.ఆ విధంగా గౌతమ్ ప్రశాంత తీరాలకు చేరుకున్నారు.వారికి వినమ్ర పూర్వక నివాళి…
విషాదాలను మోసుకువచ్చిన వార్తలు,దేహమంతా బరువుగా తోచే దుఃఖ సంబంధ సందర్భాలు.మనుషులు వెళ్లిపోయినా ఉన్నా కలిగే సద్భావన అన్నది మాత్రం అందరికీ ముఖ్యం కావాలి.నెల్లూరు దారుల్లో దుఃఖ సాగరం తొలగిపోవాలి. ఇరు తెలుగు రాష్ట్రాలనూ ప్రభావితం చేసిన ఓ సౌమ్య గుణం ఉన్న నేత మళ్లీ మన మధ్యకురావాలి. ఉదయం లేస్తే చాలు బూతులతోనే కాలక్షేపంచేసే మంత్రులు ఇప్పుడయినా మారాలి.బాబు గారూ! మీరయినా చెప్పండి వాళ్లకు!
డియర్ చంద్రబాబు గారూ! ఓ మరణం దగ్గర ఓ జననం దగ్గర, ఓ విషాదం దగ్గర ఓ వికాసం దగ్గర మనుషులు ఎలా ఉండాలో ఎలా ఉంటే బాగుంటుందో నిన్నటి వేళ మీరు నిరూపించారు. వెరీగుడ్ సర్..! మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం మా అందరి దిగ్భ్రాంతికీ కారణం. వారు భౌతికంగా ఇక్కడ లేకపోయినా, వారి నడవడి రేపటి వేళ అందరికీ ఆదర్శం కావాలి. ఆ ఇంట విషాదం తొలగి ముందున్న కాలం అంతా మంచే జరగాలి అని మనోధైర్యం నింపుతూ అంతా ఆ కుటుంబానికి అండగా ఉండాలి. చావు ఇంట కొందరు నవ్వుతున్నారు.అదెంత తప్పో మీరు మరోసారి చెప్పండి వాళ్లకు…