కుదిరితే ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్సీ…!

-

కుదిరితే ఎమ్మెల్యే.. లేకపోతే ఎమ్మెల్సీ. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు టార్గెట్‌ ఇదే. ఒకటి కాదు… రెండు కాదు.. అన్ని ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఇదే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. అధికారపార్టీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇంతకీ చట్ట సభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది ఎవరు అన్నదానిపై ఉద్యోగ సంఘాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తుంది.

30 ఏళ్లు ఉద్యోగం చేయాలి. మరో 20 ఏళ్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేదా ఎంపీగా ఉండాలి. ఇదీ ఉద్యోగ సంఘాల నేత లెక్క. సర్వీసులో కుర్చీ దిగగానే.. చట్ట సభల్లో అధ్యక్షా అని పిలవాలని తెగ తహతహలాడిపోతున్నారు. ఈ ప్రయత్నంలో కొందరికి కాలం కలిసి వచ్చినా… మరికొందరికి బ్యాడ్‌లక్‌ తప్పలేదు. అయినా మిగిలిన వారు వెనక్కి తగ్గడం లేదు. ఒకసారి బరిలో దిగితే పోలా..! గెలిస్తే జాక్‌పాట్‌.. లేకపోతే బొప్పి అంతేగా.. అంతకుమించిన నష్టం లేదుగా అనుకుటున్నారు. గెలిస్తే హోదా వస్తుంది. ఓడితే గుర్తింపు వస్తుంది. అదే అధికార పార్టీలో ఉంటే ఓడినా ఫర్వాలేదు అని లెక్కలు వేసుకుంటున్నారట.

ఈ క్రమంలోనే తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పదవులకు పోటీ మొదలైంది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ రామచంద్రరావు పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఈ రెండు స్థానాలపై ప్రధానపార్టీల ఆలోచనలు ఎలా ఉన్నా.. ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం కోటి ఆశలు పెట్టుకున్నారట. ఎన్నికల బరిలో దిగి సత్తా చాటాలని.. చట్టసభలో అడుగు పెట్టాలని ఇప్పటినుంచే పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎవరిస్థాయిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారట.

తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసిన ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రస్తుతం అధికార పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కే పాపారావు.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానంలో పోటీ చేయాలని ఉత్సాహంగా ఉన్నట్లు రవాణాశాఖలో చర్చ జరుగుతోంది. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాపారావు దగ్గరి బంధువుగా చెబుతున్నారు. పోటీ చేసే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు రవాణా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సరోజనీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసిన డాక్టర్‌ రవీందర్‌ గౌడ్‌ సైతం ఎమ్మెల్సీ రేస్‌లో ఉన్నారట. ఈయన శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ బంధువు. TNGO అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి సైతం శాసనమండలిలో అడుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో TNGO అధ్యక్షుడుగా ఉన్న స్వామిగౌడ్‌ ఎమ్మెల్సీ కాగా.. TGO అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌ రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. మరో TNGO మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి సైతం MLC బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్‌ చేసుకుంటున్నట్లు కొన్నాళ్లుగా గుసగసలు వినిపిస్తున్నాయి.

అయితే గతంలో కొన్ని ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. అయినా అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని లెక్కలేసుకుంటున్నారు. అధికార పార్టీ ఓకే అంటే ఓ లెక్క.. లేకపోతే మరో లెక్క అన్నట్లు ఇప్పటి నుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారట. మరి..వారి ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version