తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు

-

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులపై కళాశాలలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. తాజాగా ఇంజినీరింగ్ ఫీజులను భారీగా పెంచాయి. తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్ ప్రారంభించడంతో.. కళాశాలలు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందాయి.

ఇప్పటి వరకు 79 ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టు నుంచి అనుమతి పొందగా.. మరికొన్ని కాలేజీలు అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ ఫీజులను సవరిస్తారు. మూడేళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది ఫీజుల సమీక్ష కోసం రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. కాలేజీలు ఫీజులు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించగా.. యాజమాన్యాలను ఏఎఫ్ఆర్సీ అధికారులు పిలిపించి చర్చించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 35 వేల రూపాయల వార్షిక ఫీజు ఉన్న కాలేజీలు నాలుగైదే ఉన్నాయి. మరోవైపు ఫీజులు భారీగా పెరగడంతో పదివేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య భారంగా మారింది. బీసీ, ఈబీసీలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ పెంచాలన్న ఆయా శాఖల ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎటూ తేల్చక పోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version