హుజురాబాద్ లో జరిగేది కురుక్షేత్ర యుద్దమని… కౌరవులకు, పాండవులకు మధ్య జరుగుతున్న యుద్ధమిదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మేము పాండవుల పక్షాన ఉన్నోళ్లమని తెలిపారు. టీఆర్ఎస్ వాళ్లు గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్లు, పంటపొలాలపై మిడతల దండు పడ్డట్లు ఊర్లల్లో తిరుగుతున్నారని నిప్పులు చెరిగారు. మీకోసం గొంతెత్తి మాట్లాడే నా గొంతు నొక్కుతారా…? నిలుపుకుంటారా ? ఆలోచించాలని పేర్కొన్నారు.
తన దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చాడని… తన వల్లే దళితులు, గొల్ల కుర్మలు, ఇతర కులాల వాళ్లు కేసీఆర్ కు గుర్తుకు వస్తున్నారని చురకలు అంటించారు. తాను చిన్నోన్నే కావచ్చు.. చిచ్చరపిడుగులాగా కొట్లాడుతానని హెచ్చరించారు. వాళ్లను వీళ్లను తన మీద పోటీ పెట్టుడు కాదు… మీరే రావాలని హరీశ్ రావుకు, కేసీఆర్ కు చెప్పానని గుర్తు చేశారు. మీమీద నాకు నమ్మకముంది కాబట్టే.. కేసీఆర్ మీద నైనా గెలుస్తానన్న ధీమా తనదని పేర్కొన్నారు. ఇప్పటికే రూ. 200 కోట్లు ఖర్చుపెట్టారని.. డబ్బు, అధికారం విషయంలో తాను వాళ్లతో పోటీ పడకపోవచ్చన్నారు.