బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను మహేశ్వరంలోని తుక్కుగూడలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వస్తే బతుకులు బాగుపడుతై అనుకున్నా కానీ.. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిండు అంటూ ఆయన మండిపడ్డారు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే పులకరించిన జనం ఇప్పుడు అసహ్యించుకుంటున్నారని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మొదటిగా ఆర్థిక శాఖ మంత్రిగా బాధత్యలు తీసుకున్నానని, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అప్పుడు 75 వేల కోట్లేనని, కానీ 8 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పును తెలంగాణ ప్రజల మీద పెట్టాడని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అర్థరాత్రి ఏమి దొరికినా దొరకకపోయినా.. మద్యం మాత్రం దొరుకుతోందని.. ఆ విధంగా బెల్టు షాపులు తెలంగాణ పెడుతున్నారన్నారు. ఉత్తరతెలంగాణ పంటలే కొనలేక చేతులేత్తేసిన కేంద్రంపై నింద మోపాడని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలే త్వరలో పాతరేస్తరు అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.