బీజేపీ విసిరిన ఆకర్ష్ వలలో పడి కాంగ్రెస్ కీలక నేత తెగ సఫరైపోతున్నారు.ఒక వైపు పార్టీ మరో వైపు కుటుంబ సభ్యులు ఎటు వెళ్ళలో తెలియక ఇరకాటంలో పడ్డారట మాజీ డిప్యూటీ సీఎం. తెలంగాణలో జంపింగ్ జపాంగ్‌లకు ప్రాధాన్యం పెరిగిన తరుణంలో.. ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు దామోదర రాజనర్సింహ..పార్టీ మార్పు పై సొంత భార్య నుంచే అల్టిమేటం రావడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో టెన్షన్ పడుతున్నారట…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆఖరి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ. ఆందోల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ రాజకీయనేతగా పేరొందిన ఆయనకు ఈ మధ్య కాలంలో కుటుంబ సభ్యులు చుక్కలు చూపెడుతున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నారట.. అదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రాజనర్సింహను బీజేపీలో చేరాలని కోరుతున్నారట ఆయన సతీమణి పద్మినిరెడ్డి. ఇందుకు రాజనర్సింహ ససేమిరా అంటున్నట్టు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్‌లోనే ఉండాలని అనుకుంటే.. యాక్టివ్ పాత్ర పోషించొద్దని భర్తకు షరతు పెట్టారట పద్మిని. కుమార్తె త్రిషతో కలిసి తాను బీజేపీలో చేరబోతున్నట్టు పద్మిని లీకులు ఇస్తూ.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.
రాజనర్సింహ సతీమణి పద్మినికి రాజకీయాలంటే ఆసక్తి అని చెబుతారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరిపోయారు. భర్త రాజనర్సింహ మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని భార్యను ఒప్పించారు రాజనర్సింహ. ఆ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. నాడు మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలు పద్మినికే నచ్చలేదు ఇక జనాలను ఏం మెప్పిస్తారని ప్రత్యర్థి పార్టీలు ఓ రేంజ్‌లో సెటైర్లు వేశాయి.
పద్మినిరెడ్డికి ఆథ్యాత్మిక భావాలు ఎక్కువ. సమయం చిక్కితే ఆలయాలకు వెళ్తారు. గుళ్లకు భారీగా విరాళాలు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కొందరు స్వామీజీలు ఆమెను కాషాయ కండువా కప్పుకోవాలని సూచించినట్టు సమాచారం. ఆపై అన్నీ తాము చూసుకుంటామని అభయం ఇచ్చారట. అందుకే పద్మిని బీజేపీ జాయినింగ్ ఢిల్లీ స్థాయిలో ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు. ఆందోల్ ఎస్సీ నియోజకవర్గం కుదిరితే అక్కడ లేదంటే మరో చోట పోటీకి ప్లాన్ చేసుకుంటున్నారట. వీలైతే కుమార్తె త్రిషను కూడా బరిలో దించుతారని సమాచారం. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఎస్టాబ్లిష్ అయితే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట పద్మిని.
ఒకవేళ బీజేపీలో చేరాలని పద్మిని నిర్ణయిస్తే.. భర్తతో కలిసి కాషాయ కండువా కప్పుకొంటారా.. లేక కుమార్తెతో కలిసి ఆమె మాత్రమే వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ తమతో రాకపోతే.. సైలెంట్‌గా ఉండిపోవాలని భర్తకు చెప్పారట పద్మిని. అయినా ఒకే ఇంట్లో వేర్వేరు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఎంత మంది లేరు అని ప్రశ్నలు వేస్తున్నారట.