పార్టీ అధికారంలో ఉన్నా ఆ బెజవాడ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఎందుకిలా ?

-

ఆయన ఓ మాజీ ఎమ్మెల్యే. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలోనే ఉన్నారు. ఎన్నికల ముందు అధికార టీడీపీని వదిలి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినా పదవీరాలేదు. అసలు ఆ పార్టీలో ఉన్నారా లేరా అన్న విధంగా మారింది ఆయన పరిస్థితి. పార్టీలోకి తీసుకొచ్చిన మిత్రుడే వైసీపీని వీడటంతో ఆ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోనే ఉన్నా లేనట్టే ఉంది పరిస్థితి.

బెజవాడ రాజకీయ నాయకుల్లో యలమంచిలి రవికి కూడా కొంత స్థానముంది. సుదర్ఘ రాజకీయం చేసిన యలమంచిలి నాగేశ్వరరావు కుమారుడే యలమంచిలి రవి. టీడీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు యలమంచిలి నాగేశ్వరరావు. ఆయన కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన యలమంచిలి రవి ప్రజారాజ్యం తరపున బెజవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 2009లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్ ను వీడి ప్రజారాజ్యంలోకి వెళ్ళారు వంగవీటి రాధా. ఆయన కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని తానే ప్రజారాజ్యంలోకి తీసుకెళ్ళిన యలమంచిలి రవికి ఇచ్చి రాధా బెజవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటంతో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలన్న రాధాకు అది వీలవ్వకపోవటంతో వైసీపీలో చేరారు. 2014 వైసీపీ నుంచి రాధా పోటీ చేయగా, టీడీపీలో టికెట్ ఇస్తారన్న ఆలోచనతో టీడీపీలో చేరారు సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవి. అయితే రవికి టికెట్ నిరాకరించి గద్దెకు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అప్పటి నుంచ సైలెంట్ గా ఉన్న యలమంచిలి రవిని మళ్ళీ వైసీపీలోకి రప్పించారు వంగవీటి రాధా. ఎన్నికలకు ముందు రాధా వైసీపీ ని వీడడంతో యలమంచిలి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

బెజవాడ తూర్పు టికెట్ కోసం రాధా లేకపోయినా యలమంచిలి రవి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో చివరి క్షణాల్లో జనసేన వైపు చూశారు. టికెట్ ఇస్తే పోటీకి సిద్ధపడ్డా అది కుదరలేదని సన్నిహితుల టాక్. ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదే పార్టీలో యలమంచిలి రవి ఉన్నప్పటికీ క్యాడర్ మాత్రం వైసీపీ నుంచి పోటి చేసిన బొప్పన వైపు కొందరు, దేవినేని అవినాష్ వైపు మరికొందరు వెళ్ళిపోయారు. ఇక వైసీపీ ఉన్నా యలమంచిలి పరిస్థితి ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టు తయారైంది. ప్రాధాన్యత లేని వైసీపీని వీడలేక వేరే పార్టీల్లోకి చేరలేక ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి చందాన మారిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version