ఏపీ రాజధాని మార్పు అంశం ఏపీ రాజకీయ వర్గాల్లోనూ… సామాన్య ప్రజల్లో తీవ్రమైన ప్రకంపనలు రేపుతోంది. వాస్తవానికి సాధారణ ఎన్నికలకు ముందే వైసీపీ అధికారంలోకి వచ్చి.. జగన్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మార్చేస్తారని టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఎన్నికల ప్రచారంలో వైసిపి అమరావతి రాజధాని మార్పు అంశం ఉండదని టిడిపి ప్రచారాన్ని తిప్పికొట్టింది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని మార్పు అంశంపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా… రాజధాని అభివృద్ధి విషయంలో మాత్రం స్పీడ్ గా లేరన్నది ఒప్పుకుని తీరాల్సిందే.
అటు కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి అభివృద్ధి, నిధుల విషయంలో టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో అమరావతి నిర్మాణం అభివృద్ధిపై అందరికీ సందేహాలు ముసురుకున్నాయి. ఇక తాజాగా రాజధానిగా అమరావతి ప్రాంతం సేఫ్ ప్లేస్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. రాజధాని మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతాన్ని రాజధాని చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతుండగానే ఇప్పుడు మూడో పేరు తెరమీదకు రావడం సంచలనంగా మారింది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏపీ రాజధానిగా చేయాలన్న డిమాండ్లు సీమ ప్రజలు లేవనెత్తుతున్నారు. ఏపీ రాజధానిగా తిరుపతి చేయాలని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. చింతా మోహన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఆయన గతంలో పలుమార్లు తిరుపతి నుంచి ఆ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధానికి దొనకొండ కంటే తిరుపతి అనువుగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దొనకొండలో రాజధాని ఏర్పాటుకు ఎలాంటి వసతులు లేవన్నారు. అందుకే తిరుపతి కరెక్ట్ అని ఆయన చెప్పారు. రాజధాని అంశం చాలా సున్నితమైందని.. ఆ విషయంలో జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా సూచించారు. ఇక చింతామోహన్ డిమాండ్‌పై సీమ ప్రజల నుంచి సానుకూల స్పందనే వస్తోంది. సీమ ఏపీలోనే వెనకపడిన ఏరియా అని… తిరుపతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉండడంతో పాటు అన్ని విధాలా కనెక్టెవిటికి బాగుంటుందని… అందుకే తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రం విడిపోయినప్పుడే తిరుపతిని రాజధాని చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. మరి ఇప్పుడు ఈ డిమాండ్‌తో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి డెసిసన్లు తీసుకుంటుందో ? చూడాలి.