కరోనా వైరస్ నేపధ్యంలో వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ విధిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. దీనితో ఇప్పుడు చాలా రంగాలు నానా రకాల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో చర్యలు ఏమో గాని ఇప్పుడు పూట గడవని వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. దేశం ఆత్మహత్యల దిశగా వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కరోనా మరణాల కంటే… ఆత్మహత్యల మరణాలే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.
దీన్ని ఎదుర్కోవడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అతి పెద్ద సవాల్. వ్యవసాయం, చేపల సాగు, ఫార్మా రంగానికి మినహాయింపు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదుకాని జిల్లాల్లో హైవేలపై దాబాలు, ట్రక్ రిపేర్ షాపులు, భవన నిర్మాణ పనులు, సూక్ష్మచిన్న మధ్యతరహా పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, అసలు కేసులు నమోదు కాని ప్రాంతాల్లో… బ్యాంకు లకు ఆంక్షలు వద్దని భావిస్తున్నారు.
అసోం, మేఘాలయ రాష్ట్రాలు మద్యం షాపులకు కాస్త అనుమతి ఇచ్చాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఆదాయం కోసం ఇప్పుడు కొత్త మద్యం పాలసీని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. దేశంలో 720 జిల్లాలు ఉంటే.. అందులో 370 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో మాత్రం లాక్‌డౌన్‌ను అమలు చేస్తారు. ఈ రోజు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశాలూన్నాయి.